ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ తో పొత్తుకు పవన్ సై అంటాడా?

 

పవన్ కళ్యాణ్.. 2014 లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, 'కాంగ్రెస్ హటావో దేశ్ బచావో' అంటూ బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసారు.. అనుకున్నట్టే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి.. కానీ తరువాత పరిస్థితులు మారిపోయాయి.. పవన్ బీజేపీ, టీడీపీ లను విభేదించి ఒంటరిగా 2019 ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. హోదా ఇవ్వలేదని బీజేపీతో విభేదించిన పవన్, కాంగ్రెస్ కి మద్దతిచ్చే అవకాశం ఉందంటూ వార్తలు బయటికొస్తున్నాయి.. ఇప్పుడిప్పుడే మోడీ మీద వస్తున్న వ్యతిరేకతను అస్త్రంగా మలుచుకొని మళ్ళీ పుంజుకోవాలని చూస్తున్నకాంగ్రెస్, ఏపీ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది.. 

విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది.. ఏపీలో ఇప్పుడిప్పుడే ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్, ప్రత్యేకహోదా అంశంతో తిరిగి పుంజుకోవాలని చూస్తుంది.. ఇప్పటికే రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశమై ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి చర్చించారు.. కాంగ్రెస్ నుండి వెళ్లిపోయిన బలమైన నాయకులు తిరిగి పార్టీలోకి వచ్చేలా చూడాలన్నారు.. రాహుల్ ఏపీ మీద ప్రత్యేకదృష్టి పెట్టడంతో ఏపీ కాంగ్రెస్ నేతల్లో నూతనుత్తేజం వచ్చి పార్టీ బలోపేతానికి పావులు కదుపుతున్నారు.. ఇదంతా బానే ఉంది కానీ ఇప్పుడొక భేటీ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.. 

అదే, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో పవన్ భేటీ.. కాంగ్రెస్ ని తీవ్రంగా వ్యతిరేకించి, విమర్శలు చేసిన పవన్.. ఇప్పుడు కాంగ్రెస్ నేతతో భేటీ అవడంతో అందరు షాక్ అవుతున్నారు.. ప్రత్యేకహోదా కోసం పవన్ కాంగ్రెస్ కి మద్దతిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.. ప్రధాన జాతీయ పార్టీలు రెండు.. ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్.. బీజేపీ ఏపీకి ప్రత్యేకహోదా నిరాకరించింది.. కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తా అంటుంది..అందుకే, పవన్ కాంగ్రెస్ కి మద్దతిచ్చే అవకాశం ఉందనేది వాళ్ళ భావన.. మరి పవన్ ప్రత్యేకహోదా కోసం తన పంతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ తో పొత్తుకు సై అంటారో లేదో చూద్దాం.