పీఎం మోదీ.. ఆ నల్ల ట్రంకు పెట్టెలో ఏముంది?

 

బాహబలి సినిమా సమయంలో 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అనే ప్రశ్న అందర్నీ తెగ వేధించింది. అయితే బాహుబలి రెండో భాగం విడుదలయ్యాక ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. కాగా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల వేళ 'ఆ నల్ల ట్రంకు పెట్టెలో ఏముంది?' అనే ప్రశ్న వైరల్ గా మారింది.

ప్రధాని మోదీపై కర్ణాటక కాంగ్రెస్‌ శాఖ ఆదివారం ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మోదీ గత వారం ఒక ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి కర్ణాటకలోని చిత్ర దుర్గకు వెళ్ళారు. మోదీ తన హెలీకాప్టర్‌లో ఓ నల్ల ట్రంకు పెట్టెను తీసుకెళ్ళారు. ఆ పెట్టలో ఏముంది? దాన్ని ఎందుకు తీసుకెళ్లారో తేల్చాలంటూ కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ నెల 9 వ తేదీన కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం మోదీ చిత్రదుర్గ వెళ్లారు. ప్రత్యేక విమానంలో కర్ణాటక వెళ్లిన ఆయన.. హెలికాఫ్టర్‌లో చిత్రదుర్గకు వెళ్లారు. మోదీ హెలికాఫ్టర్ అలా ఆగిన వెంటనే.. కొంత మంది హెలికాఫ్టర్ నుంచి ఓ పెద్ద ట్రంక్‌ పెట్టెను తీసుకుని.. హడావుడిగా వేగంగా పరుగులు పెట్టుకుంటూ వెళ్లి.. అప్పటికే స్టార్ట్ చేసి రెడీగా ఉన్న ఓ ప్రైవేట్‌ కారులో పెట్టారు. అలా పెట్టిన మరుక్షణం ఆ కారు వేగంగా వెళ్లిపోయింది. సమీపంలోని ఓ భవనం పై నుంచి ఈ దృశ్యాలను కొంత మంది చిత్రీకరించారు. ఈ వీడియో బయటకు రావడంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది.

మామూలుగా అయితే.. ప్రధాని హెలికాఫ్టర్ దగ్గరకు కాన్వాయ్ లోని కార్లను మాత్రమే అనుమతిస్తారు. కానీ ఆ కారును ప్రత్యేకంగా అనుమతించారు. ఆ కారు ట్రంక్ పెట్టెను ఎక్కడికి తీసుకెళ్లింది?. ఇంతకీ ఆ కారు ఎవరిది? ఆ ట్రంక్ పెట్టెలో మోదీ ఏం తెచ్చారు? దాన్ని అంత రహస్యంగా ఎందుకు తీసుకెళ్లారు? ఇవన్నీ ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్లుగా మారాయి.