చిడతలు వాయించినందుకే జగన్ కు ఆ ర్యాంకు... !


 

వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌కు 35... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 36.. ఏంటీ నెంబర్లు అనుకుంటున్నారా...? ఏం లేందడీ.. ఈ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకులు ఎవరంటూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ జాబితాను విడుదుల చేసిన సంగతి తెలిసిందే కదా.  2017-18 సంవత్సరానికి గానూ అత్యంత శక్తిమంతమైన 100 మంది భారతీయుల జాబితాను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ విడుదల చేసింది. ఇక ఈ జాబితాలో ప్రధాని మోడీ గారు మొదటి స్థానంలో నిలిచారు. ఆ తరువాత.. స్థానంలో ఆయన ప్రియ మిత్రుడు అమిత్ షా నిలిచారు. అయితే ఇందులో ఆశ్చర్యం ఏం లేదనుకోండి. ఎందుకంటే...ఎలాగూ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ.. అందునా ప్రధాన మంత్రి.. ప్రధాని పదవిలో ఏ వ్యక్తి ఉన్నా శక్తివంతుడే..దీనిలో పెద్దగా చెప్పేదేమీ ఉండదు. గతంలో యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు సోనియాకు ఇదే ర్యాంకు వచ్చింది. అప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు దాన్నీ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు 'మోడీ' భక్తులు చెప్పుకుంటున్నారు అంతే తేడా.

 

అయితే ఇదే జాబితాలో జగన్‌కు 35... చంద్రబాబు నాయుడికి 36వ ర్యాంకు వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు కంటే.. జగనే అత్యంత శక్తివంతుడని సదరు పత్రిక తెలిపింది. అంతేకాదండోయే ఎందకు శక్తివంతమయ్యాడో కూడా ఆ పత్రిక వివరించింది.  ప్రతిపక్షనేత రాష్ట్రంలో బలోపేతం అవుతున్నారని...అందుకే ఆయనకు ఆ ర్యాంక్‌ వచ్చిందని సదరు పత్రిక విశ్లేషించింది. 'జగన్‌' పాదయాత్ర చేస్తూ...ప్రజలను కలుస్తున్నారని..అదే సమయంలో కేంద్రంలోని 'బిజెపి'తో అంటకాగుతున్నందున...ఆయన బలం పెరిగిపోయిందని విశ్లేషించింది. దీనిబట్టి చూస్తే అందరూ అనుకుంటున్న డౌట్లను ఈ పత్రిక క్లియర్ చేసినట్టే కనిపిస్తోంది. ఒక పక్క ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం అంటూనే మోడీతో దగ్గరవ్వడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని.. డ్రామాలు ఆడుతున్నాడని..టీడీపీ నేతలు మండిపడుతూనే ఉన్నారు. ఇప్పుడు వారు చెప్పింది నిజం చేస్తూ ఆ పత్రిక కూడా అదే చెబుతుంది. దీన్నిబట్టి చూస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.. అధికారంలోకి ఉన్నవారికి చిడతలు వాయిస్తే...శక్తివంతమైన నాయకులవుతారన్న విషయం పత్రిక విశ్లేషణ బట్టి అర్ధమవుతోంది.