థియేటర్లలో మంత్రులు,ఎమ్మెల్యేలు

 

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రత్యేక షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతించడంతో తెల్లవారుజామునుంచే అభిమానుల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం సినిమా చూసేందుకు థియేటర్ల బాట పట్టారు. నెల్లూరు ఎస్‌-2 థియేటర్‌లో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ సినిమాను వీక్షించారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. నందమూరి తారకరాముడి జీవిత చరిత్రను ‘యన్‌.టి.ఆర్‌- కథానాయకుడు’ చిత్రం కళ్లకు కట్టిందని మంత్రులు కొనియాడారు.విజయవాడ కాపిటల్‌ మూవీస్‌లో విజయవాడ ఎంపీ కేశినేని నాని తెదేపా నేతలతో కలిసి ఈ చిత్రాన్ని చూశారు. ప్రతి తెలుగువాడూ తప్పక చూడాల్సిన సినిమా ‘యన్‌.టి.ఆర్‌’ అని నాని అన్నారు.

గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో పట్టణ ప్రజలతో కలిసి గంగా మహల్‌ థియేటర్‌లో ‘యన్‌.టి.ఆర్‌’ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఎన్టీఆర్‌ చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు, రాజకీయ రంగప్రవేశం గురించి ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినిమాలో తన నటన ద్వారా చక్కగా చూపించారని కొనియాడారు. బాలకృష్ణను చూస్తుంటే ఎన్టీఆర్‌ను చూస్తున్నట్లు ఉందని తెలిపారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. పైరసీని అరికట్టాలని , థియేటర్‌కు వెళ్లి మాత్రమే సినిమా చూడాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. విశాఖలో అయితే అభిమానుల సందడి అంబరాన్ని తాకింది. యన్‌.టి.ఆర్‌ విడుదల సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మొత్తానికి యన్‌.టి.ఆర్‌ విడుదలతో రాష్ట్రమంతా పండగా వాతావరణం నెలకొంది.