సింహపురిలో ఆనం వర్సెస్ అనిల్... వైసీపీలో కలకలం రేపుతోన్న ఆధిపత్య పోరు

 

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు... అప్పటివరకు చక్రం తిప్పినోళ్లు అనామకులుగా.... అనామకులు అకస్మాత్తుగా రాజులుగా అవతరించొచ్చు... ఇది ప్రపంచంలో ఎక్కడైనా... ఎప్పుడైనా జరిగేదే అయినా.... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇటీవల ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. దశాబ్దాలు తరబడి చక్రం తిప్పిన ఉద్ధండ రాజకీయ నాయకులు... ఇఫ్పుడు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నమొన్నటివరకు తమ దగ్గర పనిచేసివాళ్లే... ఇప్పుడు రాజులుగా మారి... శాసించే స్థాయికి చేరడంతో... ఏమీచేయలేక సైలెంటైపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉండగా సింహపురి రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉందట. 

మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలాంటి నేతలెందరో... ఆనం కింద పనిచేసినవాళ్లే... కానీ ఇప్పుడు రోజులు మారాయి. అధికారం, ప్రాధాన్యతల్లో చాలా వ్యత్యాసం వచ్చింది. దాంతో ఆనం పరిస్థితి ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా తయారైంది. మరోవైపు జిల్లాలో ఎక్కడా ఆనం పేరు వినిపించకుండా మంత్రి అనిల్,  ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఇంకా ఎక్కడెక్కడ ఆనం కుటుంబ పెత్తనముందో గుర్తించి... కట్టడికి ప్రయత్నిస్తున్నారట. ముఖ్యంగా వీఆర్ విద్యాసంస్థల్లో ఆనం రామనారాయణరెడ్డి పెత్తనం లేకుండా చేసేందుకు మంత్రి అనిల్ చక్రం తిప్పారు. 114ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటగిరి రాజాల విద్యాసౌధానికి యాభై ఏళ్లుగా ఆనం కుటుంబమే యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే, ఆనం ఫ్యామిలీ నుంచి ఆ పెత్తనాన్ని లాక్కునేందుకు మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వీఆర్ విద్యాసంస్థలను పరిశీలించిన అనిల్, కోటంరెడ్డిలు కొత్త యాజమాన్యం రాబోతోందంటూ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు ఇకపై ఆనం పెత్తనాన్ని ఒప్పుకునేది లేదంటూ మాజీ పాలక వర్గాన్ని ఉద్దేశిస్తూ కామెంట్లు చేశారు. 

మొత్తానికి వీఆర్ విద్యాసంస్థల వేదికగా సింహపురి రాజకీయాలు ఇప్పుడు ఆనం వర్సెస్ అనిల్ గా మారాయనే చర్చ జరుగుతోంది. అయితే, ఇప్పటికే కోటంరెడ్డి-కాకాని గొడవతో జిల్లాలో వైసీపీ పరువు పోయిందని, ఇప్పుడు ఆనం వర్సెస్ అనిల్ గా సాగుతోన్న ఆధిపత్య రాజకీయం ఎటువైపు దారి తీస్తాయోనని సింహపురి వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి.