బంగారు తెలంగాణ ఏమో కానీ... మేఘా కంపెనీ మాత్రం బంగారమవుతోంది..!

 

కాళేశ్వరం బహుళార్ధక ఎత్తిపోతల ప్రాజెక్టు... లక్ష కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు... టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్... అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహా ప్రాజెక్టు... ఇప్పటికే దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేశారు... ఇంకా వేల కోట్ల రూపాయల పని మిగిలే ఉంది. అయితే, ప్రాజెక్టును మాత్రం ప్రారంభించేశారు. అయితే, లక్షల కోట్ల ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటివరకు అదనంగా ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణ బీడు భూములను పారింది లేదు. ప్రాజెక్టు ట్రయల్ రన్స్ మినహా తెలంగాణ రైతాంగానికి ఇప్పటివరకు ఒరిగిందేమీ లేదు. కానీ ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టరును మాత్రం అపర కుబేరుడిని చేసింది. 

ఈ ఒకే ఒక్క ప్రాజెక్టుతో మేఘా కంపెనీ తలరాతే మారిపోయింది. అవును... కాళేశ్వరం ప్రాజెక్టు... మేఘా కంపెనీకి కాసుల పంట పండించింది. కాళేశ్వరంతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేస్తామన్న కేసీఆర్....  తెలంగాణను బంగారంగా మార్చారో లేదో తెలియదు కానీ... మేఘా కంపెనీ తలరాతను మాత్రం బంగారంగా మార్చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన తర్వాత మేఘా కంపెనీ దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అమాంతం దూసుకొచ్చింది. ఫోర్బ్స్ జాబితాలో మొన్నటివరకు 47వ స్థానంలో ఉన్న మేఘా కంపెనీ యజమానులు... కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 39వ ప్లేస్ కి చేరుకున్నారు. అయితే, మేఘా కంపెనీ ఒక్కసారిగా పుంజుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని ఫోర్బ్స్ విశ్లేషించింది. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా నెట్ ప్రాఫిట్ 3వేల కోట్లు దాటిందని, అలాగే రెవెన్యూ 23శాతం వృద్ధి చెందిందని, దాంతో మేఘా ఫ్యామిలీ ఆస్తుల విలువ 6శాతం పెరిగాయని ఫోర్బ్స్ విశ్లేషించింది.

ఇక, మేఘా కంపెనీ అంటే టక్కున గుర్తొచ్చేది మేఘా కృష్ణారెడ్డే. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఎండీగా ఉన్న కృష్ణారెడ్డిపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేఘా కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కలిసి దాదాపు 40వేల కోట్ల రూపాయలు పంచుకుని తిన్నారని ఆరోపిస్తున్నాయి. ఇరిగేషన్ నిపుణుల సైతం ప్రాజెక్టు వ్యయంలో 30శాతంపైగా అవినీతి జరిగిందని విమర్శిస్తున్నారు. దోపిడీ కోసమే రీడిజైనింగ్ పేరుతో మేఘా కంపెనీకి లక్షల కోట్ల రూపాయల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టారంటూ మొదట్నుంచీ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. ఫోర్బ్స్ జాబితా చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా కంపెనీ విలువ అమాంతం పెరిగింది. దేశ అత్యంత ధనవంతుల జాబితాలో మేఘా ఫ్యామిలీ ఏకంగా 39వ స్థానానికి ఎగబాకింది. ఇక, ఫోర్బ్స్ లిస్ట్ తర్వాతే మేఘా కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాంతో కాళేశ్వరంలో తిన్న సొమ్మంతా కక్కించాలని మేఘా వ్యతిరేక వర్గం కోరుకుంటోంది. మేఘా కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల బాగోతం బయటపడాల్సిందేనని విపక్షాలూ ఆశిస్తున్నాయి. అయితే, ఒకే ఒక్క కాళేశ్వరంతో మేఘా కంపెనీ ఫోర్బ్స్ జాబితా టాప్ 40కి వచ్చేస్తే, ఇక ఏపీ, తెలంగాణలో దక్కించుకుంటున్న, దక్కించుకోబోతున్న ప్రాజెక్టులతో వచ్చే ఏడాడే టాప్ టెన్ లోకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు.