మేఘాలో కొనసాగుతోన్న ఐటీ సోదాలు... కాంట్రాక్టులు దక్కిన తీరుపై అధికారుల ఫోకస్

 

మేఘా కంపెనీల్లో వరుసగా నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు మేఘా కంపెనీ యజమానులు ఇళ్లల్లోనూ, కార్యాలయాల్లోనూ ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా, దేశవ్యాప్తంగా మేఘా కంపెనీ కార్యాలయాలు అన్నింటిలోనూ తనిఖీలు జరిపారు. అయితే, ఈరోజు మాత్రం కేవలం హైదరాబాద్ కార్యాలయాలు, అలాగే మేఘా కృష్ణారెడ్డి నివాసంలో మాత్రమే సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మేఘా లావాదేవీలు, కంపెనీ చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, ఫైనాన్షియల్ డీల్స్ పైనే ఐటీ అధికారులు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. అలాగే, మేఘా ఆర్ధిక గతినే మార్చేసిందని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా మేఘా చేపట్టిన మిషన్ భగీరథ, పట్టిసీమ, ఇతర ప్రాజెక్టుల వివరాలను కూడా ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఆయా ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియలో ఆయా ప్రభుత్వాలు అనుసరించిన విధానం, మేఘా కంపెనీకి కాంట్రాక్టు దక్కిన తీరుపై దృష్టిపెట్టారు.
 
ఇక, మూడ్రోజుల సోదాల్లో, మేఘా కంపెనీ బ్యాంకు అకౌంట్లు, అలాగే మేఘా కృష్ణారెడ్డి, అతని కుటుంబ సభ్యుల అకౌంట్లు, లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించారు. అదేవిధంగా బ్యాంకుతో నిమిత్తం లేకుండా సాగించిన ఇతర ఆర్ధిక లావాదేవీల వివరాలపై కూడా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మేఘా ఫ్యామిలీ బ్యాంకు లాకర్లపైనా ఐటీ ఆఫీసర్లు ఫోకస్ చేశారు. అలాగే, ఎన్నికల సమయంలో జరిపిన లావాదేవీలపైనా కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.