అన్నిటికీ చెడిన మజ్లిస్ పార్టీ

 

కాంగ్రెస్ పార్టీతో దాదాపు ఒక దశాబ్దంపాటు అంటకాగిన మజ్లిస్ పార్టీ, అది మర్రిచెట్టు నీడ క్రింద సేద తీరడమేనని గ్రహించింది. మర్రి నీడన మరే మొక్కలు మొలిచి ఎదగలేనట్లే కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉనంతకాలం తమకి ఎదిగే అవకాశం ఉండదని మజ్లిస్ అధినేతలయిన ఓవైసీ సోదరులకి ఒకనాడు హటాత్తుగా జ్ఞానోదయం అయింది. దానితో కిరణ్ సర్కారుతో గిల్లి కజ్జాలు పెట్టుకొని కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకొని బయటపడ్డారు. అయితే, తమ పార్టీని రాష్ట్రమంతటా త్వరగా వ్యాపింపజేసుకోవాలనే ఆలోచనతో తమ మతస్థులను ఆకట్టుకొనేందుకు కొంచెం సులువయిన మార్గం ఎంచుకొందామని విద్వేష ప్రసంగాలు చేసి వివిధ కేసులో ఇర్రుకొన్నాక గానీ తాము తప్పు ద్రోవలో పయనిస్తున్నామని వారు గ్రహించలేకపోయారు.

 

అంతకు ముందు వారితో వైకాపా కూడా స్నేహానికి సిద్దపడినప్పటికీ, ఓవైసీ సోదరుల ధోరణి చూసి ఆ పార్టీ కూడా దూరమయిపోయింది. అదే విధంగా కిరణ్ సర్కార్ పోలీసులకు ఓవైసీ సోదరులపై ఉన్న పాత కేసులన్నీ తిరగదోడడానికి అనుమతినీయడంతో వారు పూర్తిగా చల్లబడిపోయారు. కాంగ్రెస్ తో సంబంధ బాంధవ్యాలు గట్టిగా ఉన్న కాలంలో ఓవైసీ సోదరులు తమ ఓవైసీ ఆసుపత్రికి ఆనుకొని ఉన్న 2.57 ఎకరాల ప్రభుత్వభూమిని కబ్జా చేయడమే గాక మరో 10 ఎకరాల భూమిని తమకు కేటాయించాలని విజ్ఞప్తి చేసుకొన్నారు. నాడు ఈ భూకబ్జాపై కిమ్మనని ప్రభుత్వం ఓవైసీ సోదరుల విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు.

 

ఇప్పుడు కిరణ్ సర్కారుతో తిరిగి చేతులు కలపాలని ఉవ్విళ్ళూరుతున్న ఓవైసీ సోదరులకి కిరణ్ మరో జలక్ ఇస్తున్నారు. నాడు ఓవైసీ సోదరులు కబ్జాచేసిన 2.57 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాదీనం చేసుకొనేందుకు బండ్లగూడ మండల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మరో రెండుమూడు రోజుల్లో ఈ భూమిని స్వాదీనం చేసుకొని వారు ప్రభుత్వానికి అప్పగించనున్నారు. అదేవిధంగా ఒకప్పుడు ప్రభుత్వం ఓవైసీ సోదరులకిచ్చిన ఎన్‌వోసీ కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

 

 

అటు కాంగ్రెస్ పార్టీతో స్నేహం చెడగొట్టుకొన్నపటికీ, రాష్ట్రంలో వారు కొత్తగా సాధించింది ఏమిలేదు. కనీసం వైకాపాతో స్నేహ సంబంధాలు కూడా ఏర్పాటుచేసుకోలేకపోయారు. తమ విద్వేష ప్రసంగాలతో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం వలన, ఇప్పుడు వారితో చేతులు కలిపేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడంలేదు. అయితే ఎన్నికలు దగ్గిర పడేసమయానికి ఈ పరిస్థితులలో కొంత మార్పు వచ్చి ఓవైసీ సోదరులకి, వారి మజ్లిస్ పార్టీకి కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చును. గానీ, ప్రస్తుతం మాత్రం వారికి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.