న్యాయశాఖా మంత్రి అశ్వినీ కుమార్ రాజీనామా

 

రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ రాజీనామా సమర్పించిన కొన్ని గంటలలోనే న్యాయ శాఖా మంత్రి అశ్వినీ కుమార్ కూడా రాజీనామా చేయడంతో ఈ సారి ప్రజలలే కాకుండా మీడియా కూడా ఆశ్చర్య పోకతప్పలేదు. రేపు ఆదివారం నాడు కాంగ్రెస్ పెద్దలు మరో మారు సమావేశం అయిన తరువాత ఆయన చేత కూడా రాజీనామా చేయించవచ్చునని అందరు భావిస్తున్న సమయంలో హత్తాతుగా ఆయన కూడా తన రాజీనామా పత్రాన్ని ప్రధానికి అందజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

 

కర్ణాటక ఎన్నికలలో బీజేపీ అవినీతిని కడిగి పారేసిన తరువాత, ఇప్పుడు తన పెరట్లోనే అవినీతి మర్రి చెట్టులా శాఖోపశాఖలుగా విస్తరించి తన ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టడంతో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయశాఖా మంత్రికి కూడా ఉద్వాసన పలకాలని నిశ్చయించుకొన్నాకనే ఆయన రాజీనామా చేసారు.

 

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తాము అవినీతిని సహించమని డప్పుకొట్టుకొనే అవకాశం పొందడమే కాకుండా ఎన్నాళ్ళుగానో చేప్పట్టాలనుకొంటున్న మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులు చేర్పులు కూడా జరుపవచ్చునని ఆలోచన. దీనివల్ల మరో ప్రయోజనం ఏమిటంటే, పార్టీలో అసంతృప్తి నేతలకు కూడా ఏవో ఒక పదవులు కల్పించగలిగితే ఎన్నికల ముందు పార్టీలో ఐకమత్యం సాదించవచ్చును.

 

అయితే కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్ళకి లొంగి ఇద్దరు మంత్రులను తప్పించినంత మాత్రాన్నఅదేమి నిష్కళంక పార్టీ అయిపోదని అందరికీ తెలుసు. ఇద్దరు మంత్రులు రాజీనామా చేయవలసి వచ్చిందంటే దానర్ధం వారిద్దరూ తమ అవినీతిని సమర్ధంగా దాచుకోలేకపోయారని అర్ధం. అంతే తప్ప మిగిలిన మంత్రులందరూ పరిశుద్దాత్మలని చెప్పలేము. దొరికితే దొంగలు లేకుంటే ఎర్రబుగ్గ కార్లలో తిరిగే దొరలు.