తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది : కాగ్

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదని రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కాగ్ పేర్కొంది. రెండు వేల పధ్ధెనిమిది మార్చి నాటికే రాష్ట్ర అప్పులు రెండు లక్షల కోట్లు దాటాయని కొత్తగా తీసుకొస్తున్న అప్పులు సింహ భాగం పాత రుణాలు తీర్చేందుకే ఉపయోగించాల్సి వస్తోందని వెళ్ళడించింది. రెండు వేల పదిహేడు, పధ్ధెనిమిది మార్చి నాటికి ముగిసిన సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితులను కాగ్ తన నివేదికలో వివరించింది. ఈ నివేదికను ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టింది. తెలంగాణ వార్షిక బడ్జెట్ అంచనాలు వాస్తవాలకు భారీ వ్యత్యాసం ఉందని కాగ్ స్పష్టం చేసింది. రెవెన్యూ రాబడి, ఖర్చు, మూలధన వ్యయంలో అంచనాలు వాస్తవాలకు పోలిక లేదని పేర్కొంది.

బడ్జెట్ రూపకల్పనలో హేతుబద్ధత అవసరమని సూచించింది. సాగునీటి ప్రాజెక్టుల నుంచి ఏ మేరకు పలితాలు పొందుతున్నారో ప్రభుత్వం ప్రకటించలేకపోయిందని కాగ్ ఆక్షేపించింది. నిర్మాణంలో జాప్యం వల్ల ప్రాజెక్టుల వ్యయం భారీగా పెరిగినట్టు పేర్కొంది. పెట్టుబడులపై రుణాలు, డిస్కంలపై ప్రభావం చూపుతాయని స్పష్టం చేసింది. పన్నుల వసూలు మూలధన వ్యయంలో మాత్రం కేసీఆర్ సర్కారు ముందంజలో ఉందని ప్రశంసించింది. కేసీఆర్ కిట్ పథకం విజయవంతమైందని కొనియాడింది. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో దృఢ వైఖరి అవ లంబించాలని కాగ్ సూచించింది. అలా కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు బేషరుతుగా రుణాలు ఇవ్వడం, పాత రుణాలు తిరిగి చెల్లించేందుకు మళ్లీ అప్పులివ్వడం జవాబుదారీతనానికి విఘాతం కలిగిస్తోందని ఆర్ధిక నిర్వహణ సరిగా లేదన్న విషయాన్ని తెలియజేస్తోందని అబిప్రాయపడింది.

అప్పుల చెల్లింపు భారాన్ని తట్టుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులను పెంచుకోవాలి. ఇది జరగాలంటే భూములు అమ్ముకోవాలి లేదా పన్నుల పెంచుకోవాలి లేకపోతే మూలధన వ్యయాన్ని తగ్గించుకోవాల్సి వస్తుందని కాగ్ హెచ్చరించింది. ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఒక్క కోట్లు అప్పు తెస్తే అందులో పది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు వడ్డీ చెల్లింపులకు, మరో నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లు అసలు అప్పు చెల్లింపులకే వెచ్చించాల్సి వచ్చిందనీ వివరించింది. పన్నుల రాబడిలో ఎనిమిది శాతం అప్పులు చెల్లించటానికే పోతుంది అని తెలిపింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో జీ.ఎస్.డీ.పీ తో పోల్చినప్పుడు అప్పులు పదిహేను పాయింట్ రెండు తొమ్మిది శాతం ఉండగా రెండు వేల పదిహేడు, పధ్ధెనిమిదిలో పంతొమ్మిది శాతానికి పెరిగాయంది.

రెండు వేల పధ్ధెనిమిది మార్చి నాటికి ఉన్న మొత్తం అప్పు లక్షా నలభై రెండు వేల తొమ్మిది వందల పధ్ధెనిమిది కోట్లు అని తెలిపింది. ఈ అప్పులు వడ్డీల చెల్లింపులకు రానున్న ఏడేళ్లలో ప్రభుత్వం లక్ష అరవై మూడు వేల కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. మరోవైపు పూచీకత్తుల అప్పు నలభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న అప్పుల భారం రెండు లక్షల ఐదు వేల కోట్లని కాగ్ వెల్లడించింది. రాష్ట్రంలో రాబడి పెరిగినా అంచనాల స్థాయిలో లేదని తెలిపింది. రెండు వేల పదిహహేడు పధ్ధెనిమిదికి రెవిన్యూ రాబడి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు అని, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఆరు వేల ఆరు కోట్లు పెరిగినప్పటికీ బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్లు తగ్గిందని వివరించింది.

రెవెన్యూ ఖర్చుల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉందని కాగ్ వ్యాఖ్యానించింది. ఖర్చులు ఎనభై ఐదు వేల మూడు వందల అరవై ఐదు కోట్లని ఇవి అంతకుముందు ఏడాదితో పోలిస్తే మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు పెరుగుదల ఉన్నప్పటికీ అంచనాల కంటే ఏడు వేల ఇరవై ఎనిమిది కోట్లు తక్కువని పేర్కొంది. అంచనాలకు వాస్తవాలకు మధ్య అంతరం తగ్గేలా బడ్జెట్ తయారీ ప్రక్రియను హేతుబద్ధం చేయాలని కాగ్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో రెండు వేల పదిహేను, పదహారు, రెండు వేల పదిహేడు, పధ్ధెనిమిది మధ్య కాలంలో రెవెన్యూ రాబడి, ఖర్చులు రెండూ పెరిగినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. రెవెన్యూ మిగులును మూడు వేల ఏడు వందల నలభై మూడు పాయింట్ ఏడు నాలుగు కోట్ల మేర ఎక్కువగా చూపగా ద్రవ్యలోటును తొమ్మిది వందల యాభై నాలుగు పాయింట్ ఆరు కోట్ల మేర తగ్గించి చూపారని వెల్లడించింది. రెండు వేల పదహారు, పదిహహేడుతో పోలిస్తే రెండు వేల పదిహహేడు పధ్ధెనిమిదిలో వడ్డీ చెల్లింపుల్లో ఇరవై ఆరు శాతం పెరుగుదల ఉందని తెలిపింది.

విద్యా రంగంలో రాష్ట్రం వెనుకబడిందని తెలిపింది. సాగునీటి పారుదల రంగం మీద పెడుతున్న భారీ పెట్టుబడుల వల్ల కలిగిన ప్రయోజనాలను మదింపు చేయటానికి వాటి ఫలితాలను ప్రభుత్వం సంకలనం చేయాలని కాగ్ తెలిపింది. రెండు వేల పధ్ధెనిమిది మార్చి నాటికి రాష్ట్రంలో ముప్పై ఆరు సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, వీటిలో పంతొమ్మిది ప్రాజెక్టుల విషయంలో మూడు నుంచి పదకొండేళ్ల వరకు జాప్యం జరిగిందని వెల్లడించింది. ఈ కారణంగా తొలి అంచనా వ్యయం నలభై రెండు వేల రెండు వందల ఒక్క కోట్ల నుంచి లక్ష ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్లకు పెరిగిందని వివరించింది. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే డెబ్బై వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసినా అవి ఇంకా పూర్తి కాలేదని గుర్తు చేసింది.

దీనికి అదనంగా ముప్పై ఐదు వేల రెండు వందల కోట్లతో పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని సాగునీటి ప్రాజెక్టుల ఆర్థిక ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదని వెల్లడించింది. విద్యుత్ పంపిణీ సంస్థలకు బకాయిలను విడుదల చేయాలని సూచించింది. నూతన విధాన నిర్ణయాలను అమలు పరిచేటప్పుడు డిస్కమ్ లకు నష్ట పరిహారం చెల్లించాలని కాగ్ సిఫారసు చేస్తుంది. వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ నిర్ణయం డిస్కంల ఆర్థిక పరిస్థితులను మరింత ప్రభావితం చేసిందని వివరించింది.

సీపీఎస్ కోసం ఉద్యోగుల మూలవేతనం కరువు భత్యాల నుంచి ప్రభుత్వం ప్రతి నెలా పది శాతం చందాల రూపంలో వసూలు చేస్తుంది. దీనికి సమానమైన మొత్తాన్ని తన వాటాగా చెల్లించాల్సి ఉంది కానీ, ఇది అమలు కావడం లేదని ప్రభుత్వం కనీస వడ్డీలు కూడా చెల్లించడం లేదని కాగ్ పేర్కొంది. ప్రభుత్వం తన వాటాను తక్కువగా జమ చేయటం వడ్డీ కోసం కేటాయింపులు చేయకపోవడం వల్ల రెవిన్యూ మిగులు ఎక్కువగానూ, ద్రవ్యలోటును తక్కువగా చేసి చూపినట్లు తేలిందని స్పష్టం చేసింది. రెండు వేల పద్నాలుగు, పదిహేను నుంచి ప్రభుత్వం ఉద్యోగులకు నూట నలభై ఒక్క కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు బకాయి పడిందని తెలిపింది. ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దకపోతే సీపీఎస్ మూలనిధి దివాలాకు దారితీసి పథకం వైఫల్యానికి చివరికి చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది.