కేవీపీ వల్ల మేలెవరికి..? కాంగ్రెస్‌కా.. జగన్‌కా..?

రాజకీయాల్లో నెగ్గుకు రావడమంటే మామూలు విషయం కాదు. ఎత్తులు.. పై ఎత్తులు, అసంతృప్తులు వీటన్నింటిని తట్టుకుని నిలబడగలగాలి. అవతలి పక్షం వారు ఏం చేస్తున్నారో ముందుగానే ఊహించి దానికి చెక్ పెట్టాలి. అప్పుడే రాజకీయ వైకుంఠపాళిలో పాము మింగకుండా ఉంటుంది. వైరి పక్షం ఎత్తుగడలను తెలుసుకునేందుకు తన అనుకున్న కొందరిని ఆ వర్గంలో ఉంచడమో.. లేదంటే ప్రత్యర్థి వర్గంలోని కీలకవ్యక్తిని తమకు అనుకూలంగా మార్చుకుని రహస్యాలను రాబట్టేవారు రాజులు. అదే రాజతంత్రాన్ని ఆధునిక కాలంలోనూ ఘనత వహించిన నేతలు ఎందరో ఉపయోగించినట్లు మనకు చరిత్ర చెబుతోంది.

 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జమానాలో ఒక వెలుగు వెలిగిన కేవీపీ రామచంద్రరావు.. వైఎస్ మరణం తర్వాత ఒంటరిగా మిగిలిపోయారు. రాజశేఖర్ రెడ్డి అనుచరుల్లో ఎక్కువ మంది జగన్ బాటలో నడుస్తుండగా.. మరికొందరు మాత్రం తెలుగుదేశం వైపు వెళ్లిపోయారు. రాష్ట్ర విభజనలో ప్రధాన భూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీ చేసిన పాపానికి ప్రతిఫలంగా.. ఆంధ్రప్రదేశ్‌లో భూస్థాపితం అయిపోయింది. ఇప్పటికే మునిగిపోయిన కాంగ్రెస్ నావను తీరానికి చేర్చే బాధ్యతను రఘవీరారెడ్డికి అప్పగించారు. పేరుకి ఆంధ్రప్రదేశ్ పీసీపీ అధ్యక్షుడు రఘువీరా అయినప్పటికి పెత్తనమంతా కేవీపీదేనన్నది బహిరంగ రహస్యం. ఎంపీ పదవి చేతులో ఉండటం.. హైకమాండ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండటం వల్ల కేవీపీ మాటకు ఎదురు లేకుండా పోతోంది.

 

అయితే ఆయన కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చే ఆలోచనల కన్నా.. తన మిత్రుడి కొడుకు జగన్‌కు మేలు చేసేందుకే.. నిత్యం వ్యూహాలు రచిస్తున్నాడంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉండవల్లి అరుణ్ ‌కుమార్ ఉన్నపళంగా జగన్‌కు అనుకూలంగా మాట్లాడటం వెనుక.. మల్లాది విష్ణుతో పాటు మరికొందరు హస్తాన్ని వీడి జగన్ పంచన చేరడం వెనుక కేవీపీ ఉన్నారనే టాక్ 10 జెన్‌పథ్‌లో వినిపిస్తోంది. సోనియా అధినేత్రిగా ఉన్నంత కాలం కేవీపీ హవా నడిచినప్పటికీ.. రాహుల్ జమానాలో ఆయన ఆటలు సాగవని.. వీలైనంత త్వరలోనే రామచంద్రరావుకి చెక్ పెట్టేందుకు రాహుల్ గాంధీ చర్యలు తీసుకుంటారని ఏపీ కాంగ్రెస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.