ఎన్టీఆర్‌ సినిమా స్టార్ కావడం చాలా ప్లస్: కేటీఆర్

 

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 18 ఏళ్లు అయ్యింది. పార్టీ ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున.. పార్టీ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నామని పార్టీ నేతలతో అన్నారు. పార్టీలో కొత్త, పాతవారికి అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో 16 లోక్‌సభ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే గెలుపని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఇద్దరు వ్యక్తులేనని.. ఒకరు ఎన్టీఆర్‌, మరొకరు కేసీఆర్‌ అని అన్నారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు వేరని, కేసీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ పరిస్థితులు వేరని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ శూన్యత ఉందని, ఎన్టీఆర్‌ సినిమా స్టార్ కావడంతో‌.. అప్పట్లో ఆయనకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయన్నారు. కానీ కేసీఆర్‌కు ఎలాంటి అనుకూలతలు లేవని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని 2001లో కేసీఆర్‌ ఒంటరిగా మొదలు పెట్టారని.. 71 ఏళ్ల చరిత్రలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయని.. కానీ గట్టిగా నిలబడిన పార్టీ టీఆర్‌ఎస్‌ ఒక్కటేనని కేటీఆర్‌ అన్నారు.