అయ్యో పాపం కృష్ణంరాజు!

 

రాజకీయాల్లో కృష్ణంరాజు పరిస్థితిని చూస్తే ఎంతటి కఠిన హృదయాలైనా కరిగిపోతాయి. సినిమాల్లో ఒక వెలుగు వెలిగి, బీజేపీ ఎంపీగా ఎన్నికై, కేంద్ర మంత్రి పదవి కూడా నిర్వహించిన కృష్ణంరాజు రాజకీయ ప్రభ అకస్మాత్తుగా మసిబారిపోయింది. ఏ క్షణంలో అయితే ఆయన బీజేపీని వదిలి పీఆర్పీలో చేరారో అప్పటి నుంచి ఆయన్ని రాజకీయ దరిద్రం పట్టి పీడిస్తోంది. ఈ పార్టీ తర్వాత ఈ పార్టీ, ఈ పార్టీ తర్వాత ఆ పార్టీ అంటూ ఎన్ని పార్టీలు మారినా ఆయనకు రాజకీయంగా పూర్వ వైభవం రాలేదు. లేటెస్ట్ గా బీజేపీ పంచన తిరిగి చేరిన కృష్ణంరాజు తనకు కాకికాడ ఎంపీ సీటో, నరసాపురం ఎంపీసీటో వచ్చేస్తుందని, గెలిచేసి మోడీ గవర్నమెంట్లో కేంద్రమంత్రి పదవి వెలగబెట్టేయొచ్చని ఆశించారు. అయితే బీజేపీ నాయకత్వం ఆయన ఆశల మీద చన్నీళ్ళు చల్లింది. ఆయనకి ఎంపీ టిక్కెట్ ఇవ్వనని చెప్పేసింది. ప్రభాస్‌తో బీజేపీకి ప్రచారం చేయిస్తానని కృష్ణంరాజు చెప్పినా బీజేపీ వద్దు పొమ్మంది. దీంతో కృష్ణంరాజు హతాశుడైనా, చేసేదేం లేక పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయనకి సినిమావాళ్ళతో కలసి సీమాంధ్రలో ఊరూరూ తిరిగే పనిని బీజేపీ అప్పగించింది. భానుచందర్, సురేష్, శరత్‌బాబు, శివాజీరాజా, కోట శ్రీనివాసరావు, జీవిత... ఇలాంటి సీనిమావాళ్ళందర్నీ వెంటనేసుకుని ఎండలో తిరగాల్సిన బాధ్యత కృష్ణంరాజు నెత్తిన పెట్టింది. రాజకీయాల్లో పెద్దపెద్ద పదవులు అనుభవించిన కృష్ణంరాజు ఇప్పుడు ప్రచారానికి మాత్రమే పనికొస్తున్నారు. అయ్యో పాపం.