కల్వకుంట్ల కవితపై కోదండరాం పోటీ!!

 

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ బరిలోకి దిగబోతున్నట్లు ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేష్ ముదిరాజ్ తెలిపారు. ఇందుకు సంబంధించి హుజూర్ నగర్‌లో త్వరలో భారీ బహిరంగ సభ ఉండబోతోందని ఆయన వివరించారు. 

నల్లగొండ ఎంపీగా విజయం సాధించడంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్‌ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఇక్కడి నుంచి ఉత్తమ్ భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నా.. కోదండరాం బరిలో దిగితే కాంగ్రెస్ ఆయనకు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. విడివిడిగా బరిలోకి దిగి, ఓట్లు చీల్చి టీఆర్ఎస్ ను గెలిపించేకంటే.. కోదండరాం వంటి నేతను గెలిపిస్తే.. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బలంగా పోరాడతారని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు హుజూర్ నగర్ నుంచి టీఆర్ఎస్ తరపున కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ బరిలో దిగిన కవితకు బీజేపీ అభ్యర్థి అరవింద్ రూపంలో ఊహించని ఓటమి ఎదురైంది. దీంతో ఇప్పుడు కవిత హుజుర్ నగర్ బరిలో నిలిచే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నిజంగానే కవిత బరిలోకి దిగితే.. టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా రెండో ఓటమి ఎదురుకావడం కవిత రాజకీయ భవిష్యత్తుకి ఏ మాత్రం మంచిది కాదు. మరి కవిత, కోదండరాం లు నిజంగానే హుజుర్ నగర్ బరిలో దిగితే ఈ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవ్వడం ఖాయం.