బాబూ...కబడ్ధార్! కొడాలి నాని

 

నిన్నటి మొన్నటివరకు తెలుగుదేశం పార్టీని, నందమూరి కుటుంబాన్ని భుజానెత్తుకొని తిరిగిన కొడాలి నాని, జిల్లా నేతలతో పొసగక తెదేపా కాడి దింపేసి, జగన్ పార్టీ కాడి ఎత్తుకోగానే, అయన కొత్త పల్లవి అందుకొని స్వరం కూడా మార్చారు. చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు. బహుశః జిల్లాలో అయన చేస్తున్న పాదయాత్రవల్ల తన అనుచరులు మళ్ళీ తనను వీడి ఎక్కడ తెలుగుదేశం పార్టీలోకి జంపు చేస్తారననే భయంవల్లనో లేక, జిల్లాలో తన ఉనికిని ప్రదర్శించడం అవసరమని భావించడం వల్లనో కొడాలి నాని చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

 

చంద్రబాబుపై ఎదురు దాడి చేస్తూ “మా నాయకుడి గురించి, మా పార్టీ గురించి అడ్డమయిన మాటలాడితే నీ అవినీతి బాగోతాలన్ని నేను బయట పెడతాను. ఇప్పటికయినా నీ దుష్ప్రచారం ఆపకపోతే నేను కూడా రాష్ట్ర పర్యటన చేసి నువ్వు చేసిన తెరవెనుక కుట్రలన్నిటినీ ప్రజల ముందు పెడతాను. కబ్డదార్ చంద్రబాబు!” అంటూ చాల తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

 

అయితే, కొడాలి నాని ఇంత తీవ్రంగా స్పందించదానికి మరో కారణం కూడా ఉండవచ్చును. చంద్రబాబును కూడా ఎదిరించగల నాయకుడిగా తనను తానూ ప్రదర్శించుకొని, తద్వారా జగన్ పార్టీకి కృష్ణ జిల్లాలో తనే ప్రముఖ నాయకుడిగా నిలవాలనే తాపత్రయంతోనే అయన చంద్రబాబుని లక్ష్యం చేసుకొని మాట్లాడి ఉండవచ్చును. నిజంగా ఆయనకి తన నాయకుడిని, పార్టీని చంద్రబాబు విమర్శించడం కష్టమనిపించిఉంటే, ఆయన ఇదివరకే స్పందించి ఉండేవారు. కానీ, అప్పుడు మౌనంగా ఊరుకొని చంద్రబాబు తన జిల్లాలో అడుగుపెట్టాకనే స్పందించడం చూస్తుంటే, తన పార్టీపై ప్రేమ కన్నా తన రాజకీయ భవిష్యత్ ఎక్కడ దెబ్బతింటుందో అనే బెంగే ఆయనలో ఎక్కువగా కనబడుతోంది.