కాంగ్రెస్ గూటికి కేకే..?

 

 

 

కాంగ్రెస్ పార్టీలో బోలెడంత సీనియారిటీ వుండి, ఎన్నో పదవులు అనుభవించి ఈమధ్యే టీఆర్ఎస్‌లోకి జంప్‌జిలానీ అయిన కె.కేశవరావు మళ్ళీ కాంగ్రెస్‌ గూట్లోకి తిరిగొచ్చే అవకాశాలున్నాయా? ఈమధ్యకాలంలో జరిగిన పరిణామాలు, తాజాగా కేకే వ్యవహారశైలి ఇలాంటి అనుమానాలు కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తనకి మరోసారి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వకపోవడంతో అలిగిన కేకే తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి టీఆర్ఎస్‌లో చేరాడు. తాను టీఆర్ఎస్‌లోకి వెళ్ళగానే ఎక్కడికో వెళ్ళపోతానని కలలుగన్న కేకే అక్కడ ఏదో నామ్ కే వాస్తే పదవి దక్కడంతో నిరాశకు గురయ్యాడు.

 

టీఆర్‌ఎస్ పార్టీ మీటింగులలో సింహాసనం లాంటి కుర్చీలో కేసీఆర్ కూర్చుని ఉంటే, ఆ పక్కనే కాస్తంత దూరంగా విదూషకుడికి వేసేంత కుర్చీలో కూర్చుని సీరియస్ ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడం మినహా టీఆర్‌ఎస్‌లో కేకే సాధించిందేమీ లేదు. ఒకప్పుడు కేకే కూర్చున్నట్టు కేసీఆర్ పక్కనే కుర్చీలో కూర్చుని వుండే రాములమ్మ కూడా కాంగ్రెస్‌కి జై కొట్టేసింది. టీఆర్ఎస్‌లో కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్, ఆయన కుటుంబమే తప్ప బయట నుంచి వచ్చినవాళ్ళు బయటకే వెళ్తారన్న విషయం కేకేకి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్ట్టుంది.



నరేంద్ర, విజయశాంతి, రఘునందన్.. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూళ్ళేదనీ...! భవిష్యత్తులో టీఆర్ఎస్ తనకు ఎంపీ టిక్కెట్టో, ఎమ్మెల్యే టిక్కెట్టో ఇస్తుందనో, రాజ్యసభకో, మరో సభకో పంపుతుందనో ఆశించినా లాభం ఉండదన్న చేదు వాస్తవం కేకేకి ఇప్పుడిప్పుడే పూర్తిగా అర్థమవుతునట్టుంది. టీఆర్ఎస్ లాంటి నియంతల పార్టీలో ఉండటం కంటే కాంగ్రెస్ లాంటి ఏం మాట్లాడినా, ఎన్ని డ్రామాలాడినా చెల్లుబాటయ్యే, బోలెడన్ని పదవులు వచ్చే అవకాశం వున్న కాంగ్రెస్‌కే వెళ్తే బెటరనిపిస్తున్నట్టుంది. అందుకే కేకే దగ్గర మాతృసంస్థకి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న లక్షణాలు కనిపిస్తున్నాయి.



మొన్నామధ్య సీమాంధ్రలో ఎవరో సోనియాగాంధీ దిష్టిబొమ్మకి సమాధి కట్టారట. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే, ఏదో అమ్మగారి అనుగ్రహం కోసం అలా చేశారని సరిపెట్టుకోవచ్చు. కానీ టీఆర్‌ఎస్‌లో వున్న కేకే  ప్రెస్‌మీట్ పెట్టి మరీ బాధని వ్యక్తం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకెలా అర్థం చేసుకోవాలి.. కేకే మళ్ళీ కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారనే అర్థం చేసుకోవాలి.