ఇంతకీ కేసీఆర్‌కి ఏమైంది?

 

మొన్నటి దాకా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలా ఉన్నారో, ఎలా ఉండేవారో అలాగే ఉన్నారు. కానీ రెండ్రోజుల నుంచి కేసీఆర్‌లో ఏదో మార్పు కనిపిస్తోంది. అది మామూలు మార్పు కాదు... ఎవరూ ఊహించని మార్పు. అసలు ఆయనకేమైందని అందరికీ డౌటొచ్చే మార్పు. మళ్ళీ ఏ కొత్త వ్యూహం పన్నారోననే అనుమానాలు పెనుభూతాలై వేధించే మార్పు. సీమాంధ్ర పేరు చెబితే సీమ టపాకాయిలా చిటపటలాడే ఆయన రెండ్రోజులుగా సీమాంధ్రంటే బోలెడంత ప్రేమ చూపిస్తున్నారు. ఆ ప్రేమను చూసి సీమాంధ్రులు మురిసి కరిగిపోతున్నారు.

 

వైద్యరంగ దిగ్గజం శాంతా బయోటిక్స్ వరప్రసాద్ రెడ్డి తన సంస్థకు సంబంధించిన మరో యూనిట్‌కి శంకుస్థాపన చేస్తూ ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ని ఆహ్వానించారు. ఆ ప్రోగ్రామ్‌కి వెళ్ళిన కేసీఆర్ శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడుతూ మాట్లాడిన మాటలు విని సీమాంధ్రులకు కళ్ళు తిరిగిపోయాయి. వరప్రసాద్‌రెడ్డిని ఆయన ఎలా పొగిడారో చెప్పాలంటే మాటలు చాలవు. ఏ యూట్యూబ్‌లోనో ఆయన మాట్లాడిన ఫుటేజీ చూసి తరించాలంతే. వరప్రసాద్ రెడ్డిని పొగిడీ పొగిడీ ఆకాశానికి ఎత్తేసిన కేసీఆర్, ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, అంత గొప్ప వ్యక్తి తన కుటుంబంతో కలసి తమ ఇంటికి భోజనానికి రావాలని కోరి, ఆయనతో కలసి భోజనం చేయడం తమ అదృష్టం అని అన్నారంటే కేసీఆర్ ఆయన్ని ఎంత స్థాయిలో పొగిడారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ విషయం ఏమిటంటే, వరప్రసాద్ రెడ్డి సీమాంధ్రకు చెందిన వ్యక్తి.

 

వరప్రసాద్ రెడ్డిని కేసీఆర్ భారీగా పొగిడిన షాక్‌లో అందరూ ఉండగానే కేసీఆర్ గారు మరో షాకిచ్చారు. తెలంగాణలో సీమాంధ్రకు చెందిన విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ చెల్లించకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టిన 1956 నిబంధన వున్న ‘ఫాస్ట్’ పథకాన్ని ఆయనే స్వయంగా ఉపసంహరించుకున్నారు. అంతేనా, తిరుమల శ్రీవారికి తెలంగాణ ఉద్యమం విజయవంతం కావాలని మొక్కుకున్నారట. దీనికోసం శ్రీవారికి త్వరలో 5 కోట్ల రూపాయల మొక్కు చెల్లిస్తారట. పద్మావతి అమ్మవారికి, బెజవాడ కనకదుర్గమ్మకి బంగారు ముక్కుపుడకలు కూడా చేయిస్తారట. అదీ విషయం... కేసీఆర్ గారి ఈ వ్యవహారశైలి చూస్తుంటే, అసలింతకీ ఆయనకి ఏమైంది... ఆయన ఏమైనా మారారా.. లేక మారినట్టు కనిపిస్తున్నారా.. లేక ఈ మారడం, మారినట్టు కనిపించడం వెనుక ఏమైనా అంతరార్థాలు ఉన్నాయా అని తెలుగువాళ్ళందరూ బుర్రగోక్కుంటూ ఆలోచిస్తున్నారు.