ఆ మంత్రి ఓటమి ఖాయం... కేసీఆర్‌ సర్వేలోనే తేలింది?

 

తెలంగాణలో ఇప్పుడు సర్వేల గోలే నడుస్తోంది. అయితే సర్వేలపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని పక్కనబెడితే... కేసీఆర్‌ మూడో సర్వేలో ఆయన ప్రియ శిష్యుడు, మంత్రి లాస్ట్‌ ప్లేస్‌లో నిలవడం టీఆర్‌ఎస్‌లో హాప్‌ టాపిక్‌‌గా మారింది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి జగదీశ్‌‌రెడ్డికి వందకి కేవలం 30 మార్కులే వచ్చాయట. దాంతో శిష్యుడి పరువు పోతుందని జగదీశ్‌రెడ్డి మార్కులను కేసీఆర్‌ ప్రకటించలేదంటున్నారు గులాబీ నేతలు. టీఆర్‌ఎస్‌ఎల్పీ మీటింగ్‌లో జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే ఫలితాలను ప్రకటించిన కేసీఆర్‌... జగదీశ్‌రెడ్డి పేరు మాత్రం దాటవేశారు. తర్వాత చూద్దామంటూ తనదైన స్టైల్లో సైడ్‌ ట్రాక్‌ చేశారు. అయితే మంత్రికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు ఆసక్తిచూపడంతో దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. జగదీశ్‌‌రెడ్డికి కనీసం పాస్‌ మార్కులు కూడా రాలేదని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. 

 

జగదీష్ రెడ్డి మంత్రి కావడం... అది కూడా కేసీఆర్ కు అత్యంత ప్రియమైన శిష్యుడు కావడంతో ఫలితాలను ప్రకటించడానికి సీఎం ఇబ్బంది పడ్డారంటున్నారు. ఫలితాలు ప్రకటిస్తే ఓ బాధ... ప్రకటించకుంటే మరో బాధలా తయారైంది అధినేత పరిస్థితి. అందుకే జగదీష్‌రెడ్డి సర్వే ఫలితాలు  ప్రకటించకపోవడమే బెటర్ అనుకున్నారు సీఎం. అయితే జగదీష్ రెడ్డిని పేరును కాకుండా ఆ తర్వాత తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలైన తీగల, బాబూమోహన్, మాధవరం పేర్లను ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ పేర్లు ప్రకటించి... జగదీష్ రెడ్డి పేరు ప్రకటించక పోవడాన్ని తప్పుబడుతున్నారు. జగదీశ్‌‌రెడ్డి.... కేసీఆర్‌కు ప్రియశిష్యుడు కావడం వల్లే ఆయన ఫలితాలను ప్రకటించలేదని గులాబీ లీడర్లు గుసగుసలాడుకుంటున్నారు.

 

సర్వేలో జగదీష్ రెడ్డి ఫెయిల్ కావడం వెనుక చాలా కారణాలున్నాయంటున్నారు. పెద్ద, చిన్నా తేడా లేకుండా దూషణల పర్వానికి దిగుతారనే పేరుంది. అసెంబ్లీ వేదికగా ఇతర సభ్యులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి క్షమాపణలు కూడా చెప్పారు. ఏలాగూ సీఎం ఏమీ అనరన్న ధైర్యంతో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలున్నాయి. మరో వైపు నియోజకవర్గలో సైతం ఆయనకు మంచి పేరు లేదు. కనీసం కార్యకర్తలకు ప్రతి నమస్కారం కూడా చేయరని తెలుస్తోంది. అయినా సీఎంకు చాలా క్లోజ్ కాబట్టి నోరెత్తలేకపోతున్నారు. అయితే సీఎం మాత్రం జగదీష్ రెడ్డి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే... వచ్చే ఎన్నికల్లో జగదీష్ రెడ్డి గెలుస్తాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన ఓడిపోతే.. ఎలా అకామిడేట్ చేయాలన్న దానిపై కేసీఆర్ ఆలోచిస్తున్నారని పార్టీలో చర్చ సాగుతుంది. దాంతో ఆయన ఓటమి ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు.