గులాబీ కారులో సీట్ల కోసం ఫైట్

 

ఎన్నికల దారిలో కనిపించిన కాంగ్రెస్ వారందరికీ లిఫ్ట్ ఇచ్చి మరీ కారు ఎక్కించుకుంటున్న కేసీ..యార్.. టికెట్ కోసం వెనుక సీట్లో జరుగుతున్న ఫైట్ చూసి డ్రైవింగ్ పై దృష్టి పెట్టలేకపోతున్నారు. తెలుగు తమ్ముళ్ళు, ఇతరుల వలసలతో బెంబేలెత్తిపోతున్న టీఆర్ఎస్ నేతల అసంతృప్తి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి రెండు సార్లు టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సయ్యద్ ఇబ్రహీంను కాదని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కు గులాబీ దళపతి టికెట్ కేటాయించారు. దీనిపై టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ కూడా అయిన ఇబ్రహీం తీవ్రమైన ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఇస్తామని కేసీయార్ ప్రకటించినా..ఇబ్రహీమ్ వర్గీయులు సంతృప్తిచెందలేదు. దీంతో ఎన్నికల సమయానికి సమీకరణాలు మారే అవకాశం ఉంది.

 

నల్గొండ జిల్లాలో ముఖ్యనేతగా, టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందిస్తున్న చెరకు సుధాకర్ అసెంబ్లీ టికెట్ కోసం వినూత్న నిరసనలు దిగారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెరకు సుధాకర్ బెదిరించారు. ప్రత్యెక తెలంగాణా ఉద్యమం సమయంలో పీడీయాక్ట్ కింద చెరుకు సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేయడం వివాదస్పదమైంది. రాష్ట్ర హైకోర్టు జోక్యంతో సుధాకర్ ను విడుదల చేశారు. అయితే చెరుకు సుధాకర్ కు కాకుండా ఇతరులకు టికెట్ ఇస్తున్నారనే సమాచారం అందుకున్న అనుచరులు నకిరేకల్ లో సెల్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించారు.

 

తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి తనకు టీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అవకాశం కల్పించాలని కేసీఆర్ ను కోరినా అటునుంచి ఎటువంటి స్పందన లేదు. తనకు నచ్చిన వాళ్లకు సీట్లు ఇచ్చేందుకు సొంత సర్వేల పేరుతో ఉద్యమకారులను, అమరుల బంధువులను, పదేళ్లకు పైగా టీఆర్ఎస్ కష్టనష్టాల్లో వెన్నంటి ఉన్న తమకు అన్యాయం చేస్తున్నారని తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు ఆశావహులు.