కుర్చీని వదలాలంటే ఎంత కష్టమో

 

రాకరాక వచ్చిన కేంద్ర మంత్రిపదవిని వదులుకోవడం కావూరి సాంబశివరావుకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే అప్పటివరకు సమైక్యాంధ్ర నినాదాలు చేసిన ఆయన, ఆ తర్వాత ఉన్నట్టుండి స్వరం మార్చేశారు. కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు వినాలని, మనం ఏం చేయగలమని అన్నారు. ఇప్పుడు కూడా చిట్టచివరి రోజు వరకు ఆ పదవిని అనుభవించేసి, ఆ తర్వాత టీడీపీలోకి జంప్ చేసే ఆలోచనల్లో కావూరి ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇందుకోసం ముందుగా ఆయన పార్లమెంటులో తానేం ఇరగదీశానో చెబుతూ ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. ‘నా బాధ్యతల్ని శక్తి మేరకు చిత్తశుద్ధితో నిర్వహించినా పార్టీ నిర్ణయం కారణంగా మీకు నొప్పి కలిగించానేమో. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో మీరే చెప్పండి. మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ...’ అంటూ ఆ లేఖ సాగింది. ఈ లేఖను కరపత్రాలుగా ముద్రించి ఏలూరు పార్లమెం టరీ నియోజకవర్గంలో విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. ఆ కరపత్రంపై ఒక ఫోన్ నంబరు కూడా ఇచ్చి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకునే మంత్రి కావూరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖల భాగోతానికి తెరదీసినట్టు ప్రచారం జరుగుతోంది. మళ్లీ ఏలూరు లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేయాలని భావిస్తున్న ఆయన కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగితే డిపాజిట్లు కూడా రావనే అభిప్రాయనికి వచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.