కల్వకుంట్ల వారు మరీ ఇంత మాటకారులా..అబ్బో..

 

పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ప్రకటించినపుడు కేసీఆర్ పై, కేసీఆర్ కుమార్తె కవితపై తీవ్ర విమర్శలు చేసారు. కవిత అధ్యక్షతన నడుస్తున్న తెలంగాణా జాగృతి సంస్థకు విదేశాల నుండి వచ్చిన భారీ విరాళాలకు లెక్క చెప్పగలరా? అని పవన్ ప్రశ్నించారు. సాధారణంగా ఇటువంటి విమర్శలకు కొంచెం సమయం తీసుకొని జవాబుచేప్పే అలవాటున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈసారి కూడా అదే విధంగా కొంచెం సమయం తీసుకొని ఈరోజు తాపీగా జవాబు చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం చాలా మాటకారులేనని మరో మారు ఋజువు చేస్తూ పవన్ కళ్యాణ్ అడిగిన నిధుల గురించి తప్ప మిగిలిన అన్ని విషయాల గురించి కవిత చాలా చక్కగా, నేర్పుగా వేరే విషయాలను ప్రస్తావిస్తూ అసలు సంగతి దాటవేశారు. ఆయన ప్రశ్నకు జవాబు చెప్పడానికి వారం రోజుల సమయం ఎందుకు తీసుకోన్నారంటే, ఈవారం రోజుల్లో పవన్ కళ్యాణ్ తప్పతడులు వేస్తే వాటిని ఉపయోగించుకొని దీటుగా జవాబీయవచ్చునని ఆగేరేమో! అందుకే ఆమె తన విమర్శలలో పవన్ మోడీకి మద్దతు తెలపడం గురించి కూడా ప్రస్తావించారు.

 

పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు తాను జవాబీయనవసరం లేదని చెపుతూనే ఆయనొక రాజకీయ కమెడియన్ అని, సినిమాలలో ఆయన పంచే వినోదం చూడాలంటే జేబులకు చిల్లు పడుతుందని, కానీ ఈసారి ఆయనే ప్రజలకు ఉచితంగా వినోదింపజేసేందుకు వచ్చారని ఆమె ఎద్దేవా చేసారు. నిరుడు ఎన్నికలలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఆయన సోదరుడు పవన్ స్థాపించిన జనసేన పార్టీ కూడా దానిలాగే మేకప్ & ప్యాకప్ పార్టీ అని విమర్శించారు. పవన్ తనకు గద్దర్ ఇష్టమని చెపుతూ అందుకు పూర్తి విరుద్దంగా మోడీ, చంద్రబాబులకు మద్దతు ఇస్తానని చెప్పడం చూస్తే ఆయనకు సరయిన రాజకీయ అవగాహన లేదని అర్ధమవుతోందని అన్నారు.

 

దాదాపు అర్ధ గంటసేపు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన ఆమె, ఆయన అడిగిన ఒకే ఒక ప్రశ్న- విదేశాల నుండి అందుకొన్న నిధులకి లెక్కల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించకుండా తన ప్రసంగం ముగించగలగడం కల్వకుంట్ల వారి అనన్యసామాన్యమయిన వాగ్ధాటికి చిన్న మచ్చు తునక మాత్రమే.