మంత్రి రాసలీలల కేసులో మరో ట్విస్ట్

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జర్కిహొళి సెక్స్ కుంభకోణం కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఫిర్యాదుదారు సామాజిక కార్యకర్త దినేశ్ కలహళి తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. బాధితురాలి పరువు, ప్రతిష్ఠలకు భంగం కలుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దినేశ్ ఓ లేఖను తన న్యాయవాది ద్వారా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు పంపించారు. 

దినేశ్ కలహళి తరపు న్యాయవాది కుమార్ పాటిల్ మాట్లాడుతూ, తాను కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారిని కలిసి, దినేశ్ పంపిన లేఖను సమర్పించానని తెలిపారు. జర్కిహొళిపై దినేశ్  చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపానని చెప్పారు. తన క్లయింటు దినేశ్ ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకు లొంగబోరని, ఆయన సామాజిక కార్యకర్త అని, ప్రజల హక్కుల కోసం పోరాడే దక్షతగలవారని కుమార్ చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చేయడమే దినేశ్ ఆశయమని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో బాధితురాలి పరువు, ప్రతిష్ఠలకు భంగం కలుగుతోందని, ఇది మరింత తీవ్రరూపం దాల్చకుండా నిరోధించేందుకు ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నారని తెలిపారు. అవసరమైతే దినేశ్ స్వయంగా పోలీసులను కలిసి ఈ విషయాన్ని మరోసారి స్పష్టంగా చెబుతారన్నారు. ఈ కేసులో పోలీసులకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తారని చెప్పారు. 

జర్కిహొళి  ఓ మహిళతో అసభ్యకర రీతిలో ఉన్నట్లు చూపుతున్న సీడీని దినేశ్ మంగళవారం మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో జర్కిహొళి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన బీఎస్ యడియూరప్ప మంత్రివర్గంలో జల వనరుల శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu