అవనిగడ్డ నుంచి రవిశంకర్ కంఠంనేని నామినేషన్

 

 

 

దివిసీమను స్వర్గసీమగా మార్చడమే ధ్యేయంగా అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ కంఠంనేని శనివారం అవనిగడ్డ ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గా రవిశంకర్ కంఠంనేని నామినేషన్ దాఖలు చేశారు. వాస్తవానికి అవనిగడ్డ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ రవిశంకర్ కంఠంనేనికి దక్కాల్సి వుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మండలి బుద్ధప్రసాద్ జంప్ చేయడంతో బుద్ధప్రసాద్‌కి చంద్రబాబు అవనిగడ్డ టిక్కెట్ ఇచ్చారు.

 

అయితే బుద్ధ ప్రసాద్‌కి స్థానిక సమస్యలు, వాటి పరిష్కారం మీద అవగాహన లేదని, ఆయన ఇక్కడ నుంచి గెలిచే అవకాశాలు లేవని స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఎంతోకాలంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేయడంతోపాటు, పదవి లేకపోయిన్పటికీ తన సొంత ప్రాంతం మీద అభిమానంతో అవనిగడ్డ పరిసరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన రవిశంకర్ కంఠంనేనికి అవనిగడ్డ టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో స్థానిక ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల ప్రోత్సాహంతో రవిశంకర్ కంఠమనేని అవనిగడ్డ నియోజకవర్గానికి నామినేషన్ వేశారు.



శనివారం నాడు రవిశంకర్ కంఠమనేని మోపిదేవిలోని తన నివాసం నుంచి నామినేషన్ వేయడానికి అవనిగడ్డ ఎం.ఆర్.ఓ. కార్యాలయానికి పదివేలమందికి పైగా మద్దతుదారులతో ప్రదర్శనగా బయలుదేరారు. మార్గమధ్యంలో ఆయన కులమతాలకు అతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చ్ లను సందర్శించి సర్వమత సమానత్వాన్ని చాటారు. ఆ తర్వాత అవనిగడ్డ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రవిశంకర్ కంఠమనేనికి మోపిదేవి నుంచి అవనిగడ్డ వరకు స్థానికుల నుంచి మంచి ప్రతిస్పందన, అభినందనలు లభించాయి. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఈ స్థాయిలో, ఇంతమంది మద్దతుదారులతో నామినేషన్ వేసిన తొలి వ్యక్తి రవిశంకర్ కంఠమనేని అని స్థానికులు చెబుతున్నారు. రవిశంకర్ కంఠమనేని అవనిగడ్డ స్థానం నుంచి విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.