ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: కన్నా

 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడినా ప్రయోజనం ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని..  ప్రత్యేకహోదా గురించి ఇకపై ఎవరు మాట్లాడినా అది ప్రజలను మళ్లీ మభ్యపెట్టడమే అవుతుందన్నారు. 

ఏపీ అభివృద్ధి, దేశాభివృద్ధి అనే నినాదానికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని కన్నా స్పష్టం చేశారు. గత ఐదేళ్ల కాలంలో దేశంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమే బీజేపీ అఖండ విజయమన్నారు. రాష్ట్రంలో తమ పార్టీపై విష ప్రచారం చేశారని కన్నా ఆరోపించారు. జగన్ ట్రాప్‌లో పడుతున్నావని.. నాడు బాబును హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదన్నారు. ఏపీకి అన్నీ ఇచ్చామని చెప్పినా.. మా మాట పట్టించుకోకుండా తమపై నిందలు మోపారని కన్నా విమర్శించారు. తాము చేసిన అభివృద్దికి ఏపీలో తగినంత ప్రచారం లభించకపోవడం వల్లే ఏపీలో వెనుకబడ్డామని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆదివారం ప్రధాని మోదీ తిరుపతి పర్యటన ఉన్న సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడారు. ఈ నెల 9న సాయంత్రం 4.30గంటలకు తిరుపతి చేరుకోనున్న మోదీ.. సాయంత్రం 5.10 గంటల వరకు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం తిరుమల పద్మావతి వసతిగృహానికి చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటారని వెల్లడించారు. సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు శ్రీవారి సేవలో పాల్గొంటారని, ఆ తర్వాత రాత్రి 8గంటలకు తిరిగి దిల్లీకి పయనమవుతారని కన్నా వివరించారు.