వైఎస్‌ వివేకా హత్య.. లేఖ అందుకే ఇవ్వలేదు.. పదిరోజుల క్రితమే?

 

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌.. ఐదు బృందాలను నియమించి విచారణ వేగవంతం చేసింది. అదేవిధంగా కడప జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ పర్యవేక్షణలో మరో ఏడు బృందాలు ఈ కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు 20 మంది సాక్షులను విచారించారు. ఆదివారం పులివెందుల పోలీసుస్టేషన్‌కు వివేకా దగ్గరి బంధువులు ఆరుగురిని పిలిపించి విచారణ జరిపి వారి నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని గుండెపోటుతో చనిపోయినట్లు ఎందుకు చెప్పారు? పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే పడక గదిలోని రక్తపు మరకలను ఎందుకు శుభ్రం చేశారు? హత్యగా అనుమానం ఉన్నప్పుడు గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బందిని ఇంటికి తీసుకొచ్చి వివేకా తలపై అయిన గాయాలకు ఎందుకు కట్లు కట్టించారు? వంటి అంశాలపై విచారణ జరిగింది.

దర్యాప్తు వివరాలను ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ ఆదివారం రాత్రి విలేకరులకు వివరించారు. ‘వైఎస్‌ వివేకా గుండెపోటుతో మృతి చెందారని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి సెల్‌ నుంచి పోలీసులకు ఫోన్‌ వచ్చింది. కొంత సమయం తర్వాత అవినాష్‌ కార్యాలయంలో పనిచేసే భరత్‌రెడ్డి కడప జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసి వివేకా గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే పులివెందుల ఇన్‌స్పెక్టర్‌ ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే అక్కడ వివేకా పీఏ కృష్ణారెడ్డి, వాచ్‌మన్‌ రంగన్న,గంగిరెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, గంగిరెడ్డి ఆసుపత్రిలో కంపౌండరుగా పనిచేసే ప్రకాశ్‌రెడ్డి, డా.నాయక్‌, అవినాష్‌రెడ్డితో పాటు మరో 20 మంది అక్కడ ఉన్నారు. వీరిలో కొంతమంది వివేకా రక్తపు వాంతులు చేసుకుని బాత్ రూమ్ కమోడ్‌పై పడి గాయాలై చనిపోయారని పోలీసులకు వివరించారు. అంతకు ముందే పడక గదిలోని రక్తపు మరకలు శుభ్రం చేసి ఉన్నాయి. పోలీసులు వెళ్లిన సమయంలో రక్తపు మరకలతో ఉన్న దుప్పటిని అక్కడి నుంచి తొలగిస్తున్నారు. వివేకాకు తల, అరచేతిపై తీవ్ర గాయాలుండటంతో గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బంది ఆయన ఇంటికొచ్చి గాయాలకు కట్లు వేశారు. వివేకా మృతి చెందిన రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు కర్నూలు రేంజి డీఐజీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన.. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, భార్య సౌభాగ్యమ్మలను పిలిపించి మాట్లాడారు. వివేకా రాసినట్లు చెబుతున్న లేఖను ఆయన పీఏ కృష్ణారెడ్డి వద్ద నుంచి తీసుకుని సునీత డీఐజీకి అందించారు. లేఖను ఉదయమే ఎందుకు పోలీసులకు ఇవ్వలేదని డీఐజీ ప్రశ్నించగా.. డ్రైవరు ప్రసాద్‌కు ప్రాణహాని కలిగే అవకాశం ఉందని భావించి తాము వచ్చేంత వరకూ ఆ లేఖను కృష్ణారెడ్డివద్ద ఉంచాలని చెప్పామని ఆమె తెలిపారు. వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖలోని చేతి రాత ఆయనదేనని డీఐజీకి వివేకా కుమార్తె సునీత వెల్లడించారు’ అని ఎస్పీ వివరించారు.

మరోవైపు వివేకా హత్య ఘటనలో పరమేశ్వరరెడ్డి అనే వ్యక్తి పాత్ర ఉండొచ్చేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. పులివెందుల సమీపంలోని కసనూరుకు చెందిన పరమేశ్వర్‌రెడ్డి సెటిల్‌మెంట్లు, భూ వివాదాలు పరిష్కరించేవాడు. వివేకాతో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడని సమాచారం. ఇటీవల ఓ వివాదంలో పరమేశ్వర్‌తో వివేకా గొడవపడినట్లు ప్రచారం సాగుతోంది. ఈ హత్యకు పది రోజుల ముందు త్వరలో ఓ సంచలనం చూస్తారంటూ పరమేశ్వర్‌ కొందరి వద్ద మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ హత్య తర్వాత పరమేశ్వర్‌రెడ్డి ఆయన కుటుంబం అదృశ్యమవడం వెనక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.