కేఏ పాల్ నామినేషన్‌ తిరస్కరణ

 

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలవ్వడానికి ముందే.. ఏపీకి నెక్స్ట్ సీఎం నేనేనంటూ ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌ హడావుడి మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఊహించని షాక్ తగిలింది. నామినేషన్ సమయం ముగియడంతో ఆయన నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన కేఏ పాల్.. మార్చి 25 మధ్యాహ్నం భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరారు. అంతకుముందే తన బంధువు ఒకరితో నామినేషన్ పత్రాలను పంపించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నారు. పాల్ సమర్పించిన నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం ఆయన తన నామినేషన్ పత్రాలపై సంతకం చేయాల్సి ఉండగా.. అప్పటికే సమయం అయిపోయిందని అధికారులు నిరాకరించారు. తన నామినేషన్‌ను నిరాకరించడం వెనుక కుట్ర దాగి ఉందని, అధికారులు ఉద్దేశ పూర్వకంగానే అలా చేశారని కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. నరసాపురంలో ఎంపీగా గెలిచి తానేంటో చూపిస్తానని కేఏ పాల్‌ స్పష్టం చేశారు. అసలే నామినేషన్ కి చివరి రోజు, దానికి తోడు టైం కి వెళ్ళలేదు.. ఇలా అయితే సీఎం ఎలా అవుతావు కేఏ పాల్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.