గోపీచంద్ ‘జిల్’ షార్ట్ రివ్యూ



తారాగణం: గోపీచంద్, రాశీ ఖన్నా, చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫణికాంత్.  బ్యానర్: యూవీ క్రియేషన్స్‌, మ్యూజిక్: ఘిబ్రాన్, ప్రొడ్యూసర్స్: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్.

ఫ్యామిలీ కథాంశాలు తనకు అచ్చిరావని అర్థం చేసుకున్న గోపీచంద్ ఇప్పుడు తనకు నప్పే యాక్షన్ కథాంశాలను నమ్మకుంటున్నాడు. ఇప్పుడు ఆయన నటించిన స్టైలిష్ యాక్షన్ చిత్రం ‘జిల్’ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికి వస్తే, జై (గోపీచంద్) ఫైర్ ఆఫీసర్. తల్లిదండ్రుల చనిపోయిన జైని పిన్ని, బాబాయ్ పెంచి పెద్ద చేస్తారు. చాలా సినిమాల్లో జరిగే విధంగానే హీరోయిన్ని (రాశీ ఖన్నా) హీరో ఓ ప్రమాదం నుంచి కాపాడి ఆమె మనసులో పర్మినెంట్‌గా సెటిలవుతాడు. ఈ కథ ఇలా వుంటే, వరల్డ్ ఫేమస్ మాఫియా డాన్ నాయక్ (కబీర్) దగ్గర జనార్దన్ (బ్రహ్మాజీ) ఓ వెయ్యి కోట్లు కొట్టేసి పారిపోతాడు. అతనో అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే హీరో కాపాడతాడు. ఆ సమయంలో అతను చనిపోతూ హీరోకి ఓ కోటు ఇస్తాడు. ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. అయితే నిజానికి ఏమీ చెప్పడు. దాంతో చనిపోయిన జనార్దన్ హీరో జైకి వెయ్యి కోట్ల రహస్యం చెప్పాడని నాయక్ అనుమానిస్తాడు. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరిగి, చివరికి సహజంగానే సుఖాంతమవుతుంది.

‘జిల్’ కథ రొటీనే. కానీ తీసిన విధానం మాత్రం చాలా స్టైలిష్‌గావుంది. హీరో కేరెక్టర్‌తోపాటు విలన్ కేరెక్టర్ కూడా స్టైలిష్‌గా వుంది. గోపీచంద్ ఏంటో బిగుసుకుపోయినట్టు నటించాడు. ఎక్కువ స్టైలిష్‌గా కనిపించే ప్రయత్నంలో అలా కనిపించాడో లేక కాస్ట్యూమ్స్ టైట్ అయ్యాయో అర్థం కాలేదు. ఫైట్స్‌లో ఇరగదీశాడు. హీరోయిన్ రాశీఖన్నా చాలా పొదుపుగా నటించింది. నిర్మాతకు కాస్ట్యూమ్స్ ఖర్చు తగ్గించేలా చేసింది. ప్రపంచంలోని పేదరికమంతా ఆమె బట్టల్లోనే కనిపించేలా వుంది.

శరవణన్ కెమెరా పనితనం బాగుంది. డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. కాకపోతే సినిమాలో వినోదం బాగా తగ్గిన ఫీల్ కలుగుతుంది.