జేఎఫ్ఎసీని నడిపేదెవరు..?

రాష్ట్ర విభజన చట్టంలోని హామీలతో పాటు.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్డీఏ సర్కార్, ఆంధ్రప్రదేశ్‌కు ఎంత కేటాయించింది.. దానిని రాష్ట్రప్రభుత్వం ఏ మేరకు వినియోగించిందో తేల్చడానికి జనసేన అధినేత ‌పవన్ కళ్యాణ్ ఒక నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేశాడు. రాజకీయవేత్తలు, ఆర్థిక వేత్తలు, మేధావులకు ఈ కమిటీలో స్థానం కల్పించాడు. తొలుత జయప్రకాశ్ నారాయణ్, ఉండవల్లి అరుణ్ కుమార్‌ల పేర్లు మాత్రమే వినిపించడంతో.. ఇంకా దీనిలో యాక్టివ్ మెంబర్స్ ఎవరు అన్న క్లారిటీ లేదు.. అయితే జెఎఫ్‌సీ కమిటీ‌ ఫస్ట్ మీటింగ్‌లో మిగతా సభ్యులు ఎవరో తేలింది. అంతా బాగానే ఉంది..

 

ఇంతకు ఈ కమిటీకి సారథి.. అదే ఛైర్మన్ ఎవరు..? ఈ స్థానానికి ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ్. పవన్ కళ్యాణ్‌కు తొలి నుంచి జేపీ అంటే ఇష్టం. సిద్ధాంతాలు.. పనితీరు.. విషయ పరిజ్ఞానం అన్నింట్లోనూ జేపీపై ఎవ్వరికీ అనుమానాలు లేవు. పైగా పవన్ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో జయప్రకాశ్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. దానికి తోడు రాజకీయపార్టీని.. ఒక స్వచ్చంధ సంస్థను నడిపిన అనుభవం జేపీ సొంతం.

 

ఇక ఉండవల్లి విషయానికి విషయానికి వస్తే.. లాయర్‌గా, ఎంపీగా.. మేధావిగా ఆయనకు పేరుంది. కాకపోతే చంద్రబాబు అంటే కాస్తంత కోపం ఉంది.. ఎంత కాదనుకున్నా కాంగ్రెస్‌ వాసనలు పోవు కదా..! పైగా వైఎస్సార్‌కు నమ్మిన బంటు. జేఎఫ్‌సీని భుజాలపై మోసి.. ఇంత చేసిన తర్వాత, రేపు పవన్.. చంద్రబాబుకు మద్ధతుగా వెళ్తాడేమోనన్న భయం ఉండవల్లిని వెంటాడుతోంది.. అందువల్లే పూర్తిగా జేఎఫ్‌సీలో ఇన్వాల్స్ అవ్వలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే జేపీకే ఎక్కువ ప్లస్‌లు కనిపిస్తున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. మరి పవన్ మనసులో ఏముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.