జయలలిత కూతురు భవితవ్యం...హైదరాబాద్ లో తేలనుందా..!

 

తాను జయలలిత కూతురునని.. కావాలంటే డీఎన్ఏ టెస్ట్ కూడా చేసుకోమని అమృత అనే మహిళ సుప్రీంకోర్టునే కోరిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు అమృత వ్యవహారం తమిళనాడులో పెద్ద చర్చలకు దారి తీసిన సంగతి కూడా విదితమే. అయితే గత కొద్దిరోజల క్రితం సంచలనం రేపిన ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు ఇది తమిళాడును దాటి హైదరాబాద్ కు చేరింది. అదేంటీ అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. తాను జయలలిత కూతురునని... నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని.. అవసరమైతే డీఎన్ఏ టెస్ట్ చేసుకోవచ్చని కూడా సుప్రీంను కోరారు. అయితే సుప్రీం ఈ వ్యవహారాన్ని మద్రాస్ హైకోర్టు లో తేల్చుకోవాలని సూచించిన నేపథ్యంలో ఆమె మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2న కేసు విచారణకు రానుంది. ఈ కేసులో అత్యంత కీలకమైనది, బలమైనది డీఎన్ఏ ఒక్కటే కాబట్టి అమృత హైదరాబాద్‌ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)ని సంప్రదించినట్టు తెలుస్తోంది.

 

అయితే ఈ విషయంలో తమకు ఇప్పటి వరకు ఎటువంటి నమూనాలు అందలేదని...నిజానికి సీసీఎంబీ ప్రైవేటు వ్యక్తుల నుంచి డీఎన్ఏ సేకరించదు... కోర్టు ఆదేశాలపై మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తుందని.. సీసీఎంబీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇక అమృత కేసు విషయానికి వస్తే ఆమె చెబుతున్న తల్లి, తండ్రి ఇద్దరూ లేరు కాబట్టి ఆమె బంధువుల నుంచి రక్తపు నమూనాలు సేకరించి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇక జయలలిత మరణించారు కాబట్టి ఆమె రక్త నమూనాలు సేకరించే అవకాశం లేదు.. ఆమె అస్థికల డీఎన్ఏను సేకరించే వీలు లేకపోతే ఆమె తోడబుట్టిన వారి నుంచి రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఈ కేసును శాస్త్రరీత్యా నిరూపించడం అంత కష్టమైన పనేమీ కాదని అన్నారు.

 

మరి గతంలో కూడా కృష్ణమూర్తి అనే వ్యక్తి తాను జయలలిత కొడుకు అని ఏవో నఖిలీ పత్రాలు సృష్టించి కోర్టు చేత మొట్టికాయలు తిన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు జైలు శిక్ష కూడా పడింది. మరి ఇప్పుడు అమృత అనే మహిళ తెరపైకి వచ్చింది. కాకపోతే ఈమె డీఎన్ఏ టెస్ట్ కు కూడా రెడీ అవ్వడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. మరి మద్రాస్ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది... డీఎన్ఏ టెస్ట్ కు అనుమతిస్తుందా.. లేదా అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.