జగ్గారెడ్డిని ఓడించాలా?

 

తూరుపు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి మెదక్ లోక్ సభ ఉపఎన్నికలలో బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేఖించిన ఆయనను ఓడించడమే ద్యేయంగా పనిచేస్తామని ఉస్మానియా జేఏసీ ప్రకటించింది. కాంగ్రెస్, తెరాసలు కూడా ఆయనపై తెలంగాణా వ్యతిరేఖి అనే ముద్రవేసి ఓడించాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ వారందరూ ఆయనను ఓడించేందుకు ఇంతగా శ్రమ పడనవసరం లేదు. ఆయన టికెట్ కోసం బీజేపీలో చేరడంతోనే, ఆయన ఓటమి ఖరారు అయిపోయిందని చెప్పవచ్చును. ఏవిధంగా అంటే, అందుకు అనేక కారణాలు చెప్పుకోవచ్చును.

 

ఆయన బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నప్పటికీ, ప్రజలకు కాంగ్రెస్ నేతగానే చిరపరిచితుడు, కానీ ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరిన ఆయనను ప్రజలు బహుశః బీజేపీ నేతగా గుర్తించేందుకు ఇష్టపడకపోవచ్చును. కొత్తగా పార్టీలో చేరిన జగ్గారెడ్డి కోసం ప్రచారం చేసేందుకు పేరున్న పెద్ద నేతలెవరూ వచ్చే అవకాశం లేదు. కనుక ఆయన స్వంత బలంపైనే ఆధారపడి పోటీ చేయవలసి ఉంటుంది. కానీ బలమయిన కాంగ్రెస్, తెరాస అభ్యర్ధులను ఎవరి మద్దతు, సహాయ సహకారాలు లేకుండా జగ్గారెడ్డి తన స్వంత బలంపైనే గెలవడం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చును. కాంగ్రెస్ అభ్యర్ధి సునితా లక్ష్మారెడ్డి మంత్రిగా చేసిన అనుభవం, జిల్లాలో అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు, ముఖ్యంగా పార్టీలో అందరి అండదండలు ఉన్నాయి.

 

ఇక తెరాస అభ్యర్ధి కే. ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వం, దానిని నడిపిస్తున్న కేసీఆర్, ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే మంత్రులు, పార్టీ నేతలు అండగా నిలబడి ఉన్నారు. కనుక ఆయన గెలుపు దాదాపు ఖాయమనే చెప్పవచ్చును.

 

కానీ జగ్గారెడ్డికి అన్నీ ప్రతికూలంశాలే కనబడుతున్నాయి. ఆయనపై తెలంగాణా వ్యతిరేఖి అనే ముద్ర ఉండనే ఉంది. దానికి తోడు ఆయనకు ఆంధ్రాకు చెందిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారం వలన ఆయనకు మేలు జరుగకపోగా, ప్రజలలో తీవ్ర వ్యతిరేఖత ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణా మంచి ప్రజాధారణ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన చేస్తున్న విమర్శలు కూడా ప్రజలలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేఖత కలిగించే అవకాశం ఉంది. బీజేపీతో ఎన్నికలు పొత్తులు పెట్టుకొని, బీజేపీ నేతలతో భుజాలు భుజాలు రాసుకొని తిరుగుతున్న తెదేపా నేతలే కేంద్రం చేత ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు ఒక్క పైసా కూడా రప్పించలేక ఆపసోపాలు పడుతుంటే, జగ్గారెడ్డి మాత్రం తనను గెలిపిస్తే కేంద్రం నుండి భారీగా నిధులు తీసుకు వచ్చి మెదక్ జిల్లాను అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తుండటం నమ్మశక్యంగా లేదు. అందువల్ల ఆయనను ఓడించేందుకు ఎవరూ ప్రయాస పడనవసరం లేదు. బీజేపీ తరపున నామినేషన్ వేసినపుడే ఆయన ఓటమి ఖరారయిపోయిందని చెప్పవచ్చును.