విశ్వసనీయతకు పేటెంట్ హక్కులు మావే

 

దిగ్విజయ్ సింగ్, జగన్ డీ.యన్.ఏ. తమ కాంగ్రెస్ డీ.యన్.ఏ. రెండూ ఒకే రకమయినవని అన్నపుడు కాంగ్రెస్ నేతల నోట మాట రాలేదు. కాంగ్రెస్ నుండి వచ్చిన ఈ సందేశానికి వైకాపా సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తుంటే, ఆ పార్టీ నేత షర్మిల తన సోదరుడిని కాంగ్రెస్ తో పోల్చడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.

 

తన పాదయాత్రలో మంగళవారం సాయంత్రం విశాఖ జిల్లా పెందుర్తి వద్ద గల సబ్బవరం చేరుకొన్నఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, తన సోదరుడిది మూమ్మాటికీ కాంగ్రెస్ డీఎన్ఏ కాదని అన్నారు. జగన్ డీఎన్ఏ పేరు విశ్వసనీయత అయితే, కాంగ్రెస్ డీఎన్ఏ నయవంచన అని ఆమె ఎద్దేవా చేసారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లు సేవ చేశారని, రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలను నిలబెట్టారని, అయినప్పటికీ ఆ విశ్వాసం లేకుండా ఆయన పేరును సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చిందని, ఇంతటి నమ్మక ద్రోహం చేసిన వారి డీఎన్ఏతో, విస్వసనీయతకు మారు పేరుగా నిలిచిన తన సోదరుడు జగన్ డీఎన్ఏ సరిపోల్చుకోవడానికి కాంగ్రెస్ సిగ్గుపడాలని ఆమె విమర్శించారు. అదేవిధంగా సోనియా గాంధీని, కిరణ్ కుమార్ రెడ్డిని, చంద్రబాబుని, చిరంజీవిని కూడా ఆమె తీవ్రంగా విమర్శించారు.

 

కాంగ్రెస్ పార్టీపై ఇంత తీవ్రంగా విరుచుకుపడుతున్న ఆమె మరి అదే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల తరువాత మద్దతు ఈయలనుకోవడం ద్వంద ప్రమాణాలు కావా? చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా తిడుతూ, తెర వెనుక ఆ పార్టీతో కలిసిపనిచేస్తున్నాడని ఆరోపిస్తున్న షర్మిల, మరి తాము కూడా ఇప్పుడు అదే తప్పు ఎందుకు చేయబోతున్నట్లు? విశ్వసనీయతకు తాము మారుపేరని అభివర్ణించుకొనే వారు, మరి విశ్వాసంలేని కాంగ్రెస్ పార్టీ తోకపట్టుకొని ఎందుకు వ్రేలాడాలనుకొంటున్నారు?

 

ప్రజల కోసం జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారని పదేపదే నొక్కి చెపినంత మాత్రాన్న ప్రజలు నమ్ముతారనుకోవడం ఆమె భ్రమ. అతనికి ముఖ్యమంత్రి కావాలనే దురాశే అతను కాంగ్రెస్ ను వీడేలా చేసింది తప్ప షర్మిల చెపుతున్నట్లు ప్రజల ఓదార్చడం కోసం మాత్రం కాదని అందరికి తెలుసు.

 

ఆయన ఓదార్పు పేరిట తన పార్టీని బలపరుచుకొనే ప్రయత్నం చేస్తున్నపుడు, అతను ఏకుమేకవుతాడనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ, అతని వేలకోట్ల అక్రమార్జనపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో అతను కటకటాల పాలయ్యాడు. అతనికే గనుక ముఖ్యమంత్రి యావ లేకపోయి ఉంటే, నేడు కాంగ్రెస్ పార్టీలోనే ఏ కేంద్ర మంత్రి పదవో పొందేవాడని సాక్షాత్ గులాం నబీ ఆజాద్ చెప్పారు. అతని అధికార దాహం పార్టీకి దూరం చేస్తే, అతని ధన సంపాదన దాహం కటకటాల వెనుకకు నెట్టింది.

 

ఇదంతా కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నపటికీ, దేశంలో క్రింద కోర్టు నుండి పై కోర్టు వరకు అతనిని తప్పు పడుతున్నపటికీ, అతను నిర్దోషని వాదించడం అతని కుటుంబ సభ్యులకే చెల్లు. పైగా విశ్వసనీయతకి తామే పేటెంట్ హక్కులు తీసుకొన్నట్లు మాట్లాడటం మరీ విచిత్రం.