జగన్ పోరాటం చంద్రబాబుపైనా లేక ప్రత్యేక హోదా కోసమా?

 

జగన్మోహన్ రెడ్డి తను ప్రత్యేక హోదా కోసమే నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నానని చెపుతున్నారు. కానీ ఇంతకు ముందు నటుడు శివాజీ ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలని తన పోరాటానికి మద్దతు ఇమ్మని వేడుకొన్నారు. కానీ అప్పుడు జగన్ కనీసం స్పందించలేదు. కానీ ఇప్పుడు తెదేపాతో సహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు అందరూ తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. జగన్ నిజంగానే ప్రత్యేక హోదా కోరుకొంటున్నట్లయితే ఆనాడు శివాజీకి ఎందుకు మద్దతు ఈయలేదు? అప్పుడు మౌనంగా ఊరుకొని ఇప్పుడు ఎందుకు పోరాటాలు చేస్తున్నారు? అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు.

 

ఆ ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పకపోయినా తను ఇప్పుడు ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నాని నొక్కి చెపుతున్నారు. కానీ ఆయనతో సహా ఆ వేదిక మీద నుండి మాట్లాడుతున్న వైకాపా నేతలందరూ చంద్రబాబు నాయుడునే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ప్రత్యేక హోదా మంజూరు చేయవలసిన అసలు వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు? ఇవ్వకపోతే తెదేపాను బంగాళాఖాతంలో కలిపేస్తామని బెదిరిస్తున్నట్లే బీజేపీని కూడా కలిపేస్తామని ఎందుకు హెచ్చరించడం లేదు? కనీసం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని దైర్యంగా ప్రశ్నించడం లేదు. అంటే వైకాపా చేస్తున్న ఈ పోరాటం అంతా చంద్రబాబు నాయుడు మీదే తప్ప నరేంద్ర మోడి మీదో లేక ప్రత్యేక హోదా కోసమో కాదనే అభిప్రాయం వైకాపా నేతలే కలిగిస్తున్నారు.

 

చంద్రబాబు నాయుడు తన ఇద్దరు కేంద్రమంత్రుల చేత రాజీనామాలు చేయిస్తే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని బోడి గుండికి మోకాలుకి ముడి వేసినట్లు వాదిస్తున్నారు. కానీ మోడీ ప్రభుత్వం ఎవరి మద్దతుపై ఆధారపడిలేదనే సంగతి వారికీ తెలుసు. కేవలం తెదేపాతో ఉన్న మిత్రత్వం కారణంగానే ఆ పార్టీకి చెందిన ఇద్దరికి మోడీ మంత్రి పదవులు ఇచ్చారు తప్ప తన ప్రభుత్వానికి తెదేపా ఎంపీల మద్దతు అవసరమయి కాదు. అటువంటప్పుడు వారిద్దరూ రాజీనామా చేస్తే ఏమవుతుంది? మోడీ ప్రభుత్వం పడిపోదు కానీ తెదేపా-బీజేపీల మధ్య స్నేహ బందం చెడిపోతుంది. బహుశః వైకాపా అదే కోరుకొంటోంది కనుకనే పదేపదే ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామాకు పట్టుబడుతోంది. అప్పుడు బీజేపీ అంగీకరిస్తే దానితో పొత్తులు పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన కావచ్చును.

 

కానీ ‘అవినీతి పరుడయిన జగన్మోహన్ రెడ్డితో తమ పార్టీ ఎన్నటికీ పొత్తులు పెట్టుకొబోదని’ డా. కామినేని శ్రీనివాస రావు నిన్ననే విస్పష్టంగా చెప్పారు. ఇంతకు ముందు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా అదే ముక్క చెప్పారు. అయినా జగన్ ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని చెపుతున్న జగన్ ఇటువంటి రాజకీయాలు చేస్తున్నందునే ఆయన చేస్తున్న పోరాటాన్ని ప్రజలు విశ్వసించడం లేదని చెప్పవచ్చును.

 

జగన్మోహన్ రెడ్డి నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకొని నేరుగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించే ప్రయత్నం చేస్తే అందరూ ఆయనకి సహకరిస్తారు. కానీ ప్రత్యేక హోదా సాధించడం కోసం కాకుండా చంద్రబాబు నాయుడు సాధించడం కోసమే పోరాటాలు చేస్తే దానిని వైకాపా-తెదేపాల మధ్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరుగానే ప్రజలు చూస్తారు. ప్రజల, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా ఆధిపత్యపోరుకి పూనుకొంటే ఎన్నటికీ ప్రజల మద్దతు పొందలేరని జగన్ గ్రహిస్తే మంచిది.