జగన్‌కు షాక్‌ మీద షాక్‌... తప్పు మీద తప్పు చేస్తోన్న జగన్‌ !


వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి షాక్‌ మీద షాక్‌‌లు తగులుతున్నాయి. ప్రధాని మోడీతో భేటీ తర్వాత బీజేపీకి దగ్గరైనట్లు విస్తృతంగా ప్రచారం జరిగినా... తెలుగు రాష్ట్రాల పర్యటనకొచ్చిన కమల దళపతి అమిత్‌షా మాత్రం జగన్‌ ఆశలపై నీళ్లు చల్లేశారు. ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని అమిత్‌షా ప్రకటించడంతో... తెలుగుదేశాన్ని పక్కకు జరిపి... ఆ గ్యాప్‌లోకి దూరేద్దామనుకున్న జగన్‌ ప్లాన్‌ బెడిసికొట్టింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతిస్తామని జగన్‌ బహిరంగంగా ప్రకటించినా... వైసీపీ గురించి అమిత్‌షా నోట ఒక్క మాట కూడా రాకపోవడం... ఆ పార్టీ నేతలు షాక్‌కి గురైనట్లు తెలుస్తోంది.

 

అయితే తన రాజకీయ అవసరాల కోసం ప్రాంతీయ పార్టీలతో బీజేపీ గేమ్‌ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. అది టీడీపీ అయినా... వైసీపీ అయినా ఒక్కటేనన్న రీతిలో వ్యవహరిస్తోంది. ఒకవైపు టీడీపీతో మిత్రబంధాన్ని కొనసాగిస్తూనే... తోక జాడిస్తే మాత్రం తమకు వైసీపీ ఉందనే హెచ్చరికలను పంపుతోంది బీజేపీ. అంతేకాదు ఎప్పుడు ఎవరు అవసరమొస్తారో తెలియదు కనుక... ఎవర్నీ దూరం చేసుకోకుండా వైసీపీని కూడా దగ్గరకు తీస్తోంది కమలం పార్టీ. ఏదిఏమైనా ఫైనల్‌గా తమ లాభమే ముఖ్యమన్నట్లు బీజేపీ వ్యవహరిస్తోంది. అందుకే ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందన్న అమిత్‌‌షా.... తెలంగాణలో మాత్రం ఉంటుందో లేదో చెప్పలేదు.

 

ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏకి మద్దతిస్తామని జగన్‌ ప్రకటించడంతో వైసీపీ తన ఓటు బ్యాంకును కోల్పోవడం ఖాయమంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ... బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో... మెజారిటీ క్రిస్టియన్లు, ముస్లింలు వైసీపీ వెంట నడిచారు. అయితే మతతత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీకి జగన్‌ మద్దతిస్తామని ప్రకటించడంతో... ఆ రెండు వర్గాలూ జగన్‌కు దూరమవుతారని విశ్లేషిస్తున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ సీనియర్లు జగన్‌కు వివరించినా పట్టించుకోలేదని తెలుస్తోంది. అయితే కేసులతో సతమతమవుతోన్న జగన్‌... వాటి నుంచి తప్పించుకోవడానికే ఈ సాహసానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు.

 

ఇక వైసీపీ విషయంలో ఎలా వ్యవహరించాలో తెలియక తికమకపడుతోన్న కాంగ్రెస్‌ పార్టీ... జగన్‌ ప్రకటనతో ఓ క్లారిటీకి వచ్చింది. జగన్‌... ఎన్టీఏ వైపు మొగ్గుచూపడంతో... క్రిస్టియన్లు, ముస్లింలను మళ్లీ తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ లెక్కన జగన్‌ రాజకీయ వ్యూహాలు.... రెండింటికీ చెడ్డ రేవడిలా ఉన్నాయనే మాట వినిపిస్తోంది.