టార్గెట్‌ నల్గొండ... ఒకే దెబ్బకు రెండు పిట్టలంటున్న కేసీఆర్‌

 

బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్... ఇపుడు ఈ మూడు పార్టీల టార్గెట్ ఒకటే. అదే నల్గొండ జిల్లాలో పైచేయి సాధించడం. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులను పడగొట్టి తమ సత్తా చాటడం. అందుకే ఇపుడు రాష్ట్ర రాజకీయాలకు ఈ జిల్లా సెంటర్ పాయింట్‌గా మారింది. దాంతో నల్గొండ జిల్లా రాజకీయాలు ఎన్నికలకు రెండేళ్ల ముందే వేడెక్కుతున్నాయి. గెలుపు కోసం ఇప్పట్నుంచే ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి.

 

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ లీడర్‌, ప్రతిపక్ష నేత జానారెడ్డి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిలాంటి కాకలు తీరిన నేతలంతా ఈ జిల్లాకు చెందినవారే. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి ఎదురునిలిచి తమ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించుకోగలిగారు. ఇలాంటి చోట కాంగ్రెస్ ను ఖతం చేసి తమ జెండా ఎగరేయాలనుకుంటున్నాయి టీఆర్ఎస్, బీజేపీ.

 

మూడ్రోజులపాటు నల్గొండలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఒక్కసారిగా జిల్లా రాజకీయాలను వేడెక్కించారు. జిల్లాలో చాలామంది నేతలు కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారంటూ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపంటూ క్యాడర్ లో నూతనోత్తేజాన్ని నింపారు.

 

అమిత్ షా రాకతో రాజుకున్న రాజకీయ వేడిని... తన సర్వేతో మరింత పెంచారు సీఎం కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అసెంబ్లీ స్థానాలన్నిటినీ తామే కైవసం చేసుకోబోతున్నామని, ప్రత్యర్థి పార్టీలకు ఒక్కసీటు కూడా రాదని ప్రకటించి పొలిటికల్ వార్ కు తెరలేపారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు తమ క్యాడర్ లో జోష్ నింపుతూనే... మరోవైపు జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్.... బలపడాలని కోరుకుంటున్న బీజేపీని టార్గెట్ చేసుకున్నారు. మరి 2019లో జిల్లా ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.