బీజేపీలోకి హరీష్ రావు.. టీఆర్ఎస్ లో చీలిక!!

 

బంతిని నేలకి ఎంత బలంగా విసిరితే.. నింగికి అంత బలంగా ఎగురుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఇదే జరగబోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే కేసీఆర్ తరువాత హరీష్ రావు పేరు వినిపించేది. కష్ట కాలంలో కేసీఆర్ కి అండగా ఉంటూ పార్టీని బలపరచడానికి హరీష్ కృషి చేసారు. గెలుపు అసాధ్యం అనుకున్న స్థానాల్లో కూడా హరీష్ పార్టీని గెలిపించి చూపించారు. ట్రబుల్ షూటర్ గా పేరుతెచ్చుకున్నారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు లెక్క పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కేసీఆర్ కి పార్టీలో ఏ వ్యవహారమైనా ముందుగా మేనల్లుడు హరీష్ పేరు గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఈ మార్పు ఇటీవల స్పష్టంగా కనిపిస్తుంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసాధ్యమనుకున్న స్థానాల్లో హరీష్ టీఆర్ఎస్ జెండా ఎగిరేలా చేసారు. అయితే అప్పటికే కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కోసం హరీష్ ని పక్కన పెడుతున్నారనే ప్రచారం జరిగేది. ఎన్నికల తరువాత ఆ ప్రచారం మరింత బలపడింది. హరీష్ కి మంత్రివర్గంలో చోటులేదు, పార్టీలో సరైన స్థానంలేదు. దీంతో హరీష్ అభిమానుల్లో ఆవేదన మొదలైంది. అయితే హరీష్ మాత్రం ఎప్పుడూ కేసీఆర్ కి కానీ, పార్టీకి కానీ వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. తన విధేయత చూపుతూ వస్తున్నారు.

అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంతో.. హరీష్ కి అన్యాయం జరుగుతుందనే చర్చ మళ్ళీ తెర మీదకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కోసం ఎంతో శ్రమించిన హరీష్‌కు.. కనీసం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పార్టీ శ్రేణుల్లోనూ, అటు సామాన్య ప్రజల్లోనూ హరీష్ పై సానుభూతి వ్యక్తమవుతోంది. అయితే హరీష్ మాత్రం ఇంత జరుగుతున్నా తన విధేయత చాటుకుంటూనే ఉన్నారు. సిద్దిపేటలో ఘనంగా కాళేశ్వరం ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించి.. ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా కేసీఆర్ దే అనేసారు. దీంతో హరీష్ మీద ప్రజల్లో మరింత సానుభూతి, అభిమానం పెరిగాయి.

అయితే ఇవన్నీ మౌనంగా భరిస్తూ విధేయత చూపుతున్న హరీష్.. ఎప్పుడో అగ్నిపర్వతంలా పేలి పార్టీలో ప్రళయం సృష్టిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ చూపు కూడా ఇప్పుడు హరీష్ పై పడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో బీజేపీలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. తెలంగాణలో 2023 లో అధికారమే లక్ష్యంగా పార్టీని బలపరచాలని అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలను కూడా పార్టీలో చేర్చుకుంది. అయితే బీజేపీ ఇలా నెమ్మది నెమ్మదిగా బలపడటం కంటే ఒకేసారి కుంభస్థలాన్ని కొట్టాలని చూస్తోందట. అందుకే ఇప్పుడు హరీష్ ని పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోందట. హరీష్ చేరితే టీఆర్ఎస్ లో చీలిక వచ్చి బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనేది ఆ పార్టీ పెద్దల భావనగా తెలుస్తోంది. ఎలాగూ ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకొనే పరిస్థితి లేదు. హరీష్ వస్తే టీఆర్ఎస్ బలం కూడా తగ్గుతుంది. దీంతో 2023 అధికారంలోకి రావాలనే ఆశ నెరవేరుతుంది. ఇదే ప్రస్తుతం బీజేపీ ప్లాన్ అని తెలుస్తోంది. మరి హరీష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.