అమరావతి మునిగే ఛాన్సే లేదు... ఇవిగో ఆధారాలు... తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్

 

అమరావతి గ్రామానికి... రాజధాని అమరావతికి తేడా తెలియకుండానే మంత్రులు మాట్లాడుతున్నారా? అమరావతి నగరంపై మంత్రి బొత్సకు అసలు అవగాహన ఉందా? లేక విలేకరులు అడిగారని... తెలిసీ తెలియని సమాచారంతో అత్యుత్సాహంతో మాట్లాడేశారా? అసలింతకీ బొత్స చెబుతున్నట్లు రాజధాని అమరావతికి ముంపు ప్రమాదం ఉందా? లేదా? తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకోసం.

అమరావతి గ్రామానికి... రాజధాని అమరావతికి తేడా తెలియకుండానే మంత్రి బొత్స మాట్లాడినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే, నవ్యాంధ్ర రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి ప్రాంతం బౌండరీస్ గట్టుపైన ఉన్నాయి. అది సముద్ర మట్టానికి 24 మీటర్ల ఎత్తులో ఉంది. ఆ ఎత్తును 25 మీటర్లకు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే, 2009లో భారీ వరదలు వచ్చినప్పుడు సైతం కృష్ణమ్మ... సముద్రమట్టానికి 21 మీటర్లు దాటలేదు. అంటే వరద ఇంకో 12 అడుగులు (3 మీటర్లు) మేర పెరిగినా రాజధాని అమరావతి ఇంచు కూడా మునగదు. ఇక ప్రకాశం బ్యారేజీ రోడ్ కూడా సముద్ర మట్టానికి 25 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే రాజధాని అమరావతిలోకి నీళ్లు రావాలంటే, కృష్ణమ్మ... ప్రకాశం బ్యారేజీ పైనుంచి పొంగి పొర్లాలి. అదే జరిగితే అమరావతే కాదు... కృష్ణా డెల్టా మొత్తం మునిగిపోవాల్సి ఉంటుంది. ఇక కొండవీటి వాగు లిఫ్ట్ వల్ల... వాగులోకి వరద ఎదురుతన్నే ఛాన్సే లేదు. మరి అలాంటప్పుడు రాజధాని అమరావతి ఎలా మునుగుతుంది? ఒకవేళ అమరావతి మునగాలంటే... రెండు మూడు డ్యాములు బద్దలైతే తప్ప సాధ్యంకాదు.
 
ఇక కృష్ణా కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లుకి, రాజధాని అమరావతికి అస్సలు లింకు పెట్టుకూడదు. ఎందుకంటే, చంద్రబాబు ఇల్లు ... గట్టుకి నదికి మధ్యన ఉంది. ఆ ప్రాంతం దాదాపు 250 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు కట్టే ప్లాన్ లేదు. అక్కడ కేవలం రివర్ టూరిజం ప్రాజెక్ట్స్, ప్లే గ్రౌండ్స్, పార్కులు మాత్రమే వస్తాయి. మరి, అమరావతి మునిగిపోతుందని... మంత్రులు తెలిసి మాట్లాడుతున్నారో... తెలియక మాట్లాడుతున్నారో... లేక చంద్రబాబుపై కక్షతోనే మాట్లాడుతున్నారో తెలియదు గానీ, అమాత్యుల్లో అవగాహనారాహిత్యమైతే కనబడుతోంది. 

ఇక ఏకపక్ష విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ కు అద్భుతమైన రాజధాని కావాలని, అది ప్రపంచశ్రేణి నగరం కావాలని, ఏపీ భవిష్యత్ కోసం తమ భూములను త్యాగంచేసిన రైతులకు మంత్రులు ఏం సమాధానం చెబుతారు? వేలాది మంది రైతుల త్యాగాలను, ఉసురును ప్రభుత్వం మూటగట్టుకుంటుందా? ల్యాండ్ ఫూలింగ్ లో కేవలం ఆరేడు వందల ఎకరాల భూములివ్వని రైతుల కోసం పోరాడిన మేధావులు... ఇప్పుడు 33వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు?