మహబూబాబాద్ పెద్దాయన స్కెచ్.. సత్యవతి రాథోడ్ పతనానికి ప్లాన్ చేస్తున్న పెద్ద మనిషి అతనేనా?

టీఆర్ఎస్ పార్టీలో అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న వారిలో ఒకరు సత్యవతి రాథోడ్. గులాబీ పార్టీలో చేరినప్పటి నుంచి కేసీఆర్ సూచనలను పాటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యం లోనే పార్టీలో పలువురు ముఖ్యనేతల అంచనాలను తారుమారు చేస్తూ తొలుత ఎమ్మెల్సీ పీఠం దక్కించుకున్నారు. అనంతరం కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు. అయినప్పటికీ సత్యవతి రాథోడ్ ను ఉమ్మడి వరంగల్ జిల్లాని టీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు. కేవలం మహబూబాబాద్ జిల్లాకే ఆమె పరిమితం అయినట్టుగా వ్యవహరిస్తున్నారు.

ఎర్రబెల్లి దయాకరరావు మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. వినయ్ భాస్కర్ కి చీఫ్ విప్ పదవి వచ్చినప్పుడు బాగా హడావుడి చేశారు. పల్ల రాజేశ్వర్ రెడ్డిని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా చేసినప్పుడు కూడా ఉమ్మడి జిల్లాలో భారీ సన్మాన సభ ఏర్పాటు చేశారు. కానీ మంత్రి సత్యవతి రాథోడ్ ని మాత్రం పట్టించుకొనేవారే కన్పించడం లేదు. ఈ జిల్లా నేతలు కాకపోయినా ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు వరంగల్ కు వచ్చినప్పుడు వారికి కూడా ఘనమైన రీతిలో గౌరవ మర్యాదలు జరిగాయి. నిన్న మొన్నటి వరకు ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పల్ల రాజేశ్వర్ రెడ్డికి జరిగిన సన్మాన సభ తర్వాత సత్యవతి రాథోడ్ అంశం అందరి దృష్టిలోకి వచ్చింది. గిరిజన సామాజిక వర్గం నుంచి ఎదిగిన సత్యవతి రాథోడ్ ను ఉమ్మడి వరంగల్ నేతలు చిన్నచూపు చూడడానికి ఆధిపత్యపోరే కారణం కావచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బతుకమ్మ వేడుకలను అధికారికంగా వరంగల్ లో ప్రారంభించిన సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మొదటి సారి సత్యవతి రాథోడ్ వరంగల్ కు వచ్చారు. మంత్రులు దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి ఈ వేడుకలను ప్రారంభించారు. మొదటిసారి వరంగల్ కు వచ్చినప్పుడు ఒక వైపు పండుగ సందడి మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతున్నాయి. అందువల్లే ఆమెకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయలేదేమోనని అందరూ భావించారు. అత్యాచారం ఆపై హత్యకు గురైన ఓ మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ మరోసారి జిల్లాకు వచ్చారు. అప్పుడు కూడా ఆమె రాకపోకల సందడే లేదు. వరంగల్ జిల్లాలో గవర్నర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎంవో ఆదేశాలతో మరొకసారి వరంగల్ జిల్లాకు సత్యవతి రాథోడ్ విచ్చేశారు. అప్పుడు కూడా ప్రత్యేకంగా హడావిడి కనిపించలేదు.

ఇటీవలే వరంగల్ నగరంలో జరిగిన అతి రుద్ర యాగంలో పాల్గొనేందుకు వచ్చారు మంత్రి సత్యవతి రాథోడ్. పూజాకార్యక్రమాలు ముగిశాక ములుగుకు వెళ్లారు మేడారం జాతర పనుల సమీక్ష సమావేశం నిర్వహించి నేరుగా వరంగల్ కు వచ్చినప్పుడు కూడా మంత్రిని ఎవరూ పట్టించుకోక పోవడం గమనార్హం. మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహబూబాబాద్ జిల్లాలో సత్యవతి రాథోడ్ తొలి పర్యటన చేశారు. నాటి పర్యటనలో కేవలం శంకర్ నాయక్ మహబూబాబాద్ ఎంపీ కవిత మినహా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనలేదు. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ జిల్లాకు వెళ్లే దారిలో పలు నియోజకవర్గాలోని ప్రజాప్రతినిధులు కూడా ఆమెను కలిసి శుభాకాంక్షలు చెప్పలేదు. ఇలా ఎందుకు జరుగుతోందని అందరిలో ప్రశ్న మెదులుతుంది. సత్యవతి రాథోడ్ కి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య గ్యాప్ ఏర్పడిందన్న అభిప్రాయం గులాబి వర్గాల్లో ఏర్పడింది. మొన్నటి ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా బాధ్యతలు చూసిన ఓ పెద్దమనిషి పాత్ర ఇందులో ఉందనే అనుమానాలు సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం పార్టీ పెద్దల దృష్టికి వెళితే ఎలా స్పందిస్తారో చూడాలి.