ప్లాన్ అదిరింది.. రాజధాని విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలనే బలి చేసిన జగన్!!

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణాలను నిలిపివేసింది. ఈ మేరకు కాంట్రాక్టర్ లకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ చర్యపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో రైతులకు కౌలు మాత్రం చెల్లించారు. కానీ అక్కడి నుండే అస్సలు స్కెచ్ మొదలైంది. కృష్ణా నదికి వరదలు రాగానే రాజధాని మునిగిపోతోందని ప్రచారాలు చేశారు. 2009 లో 11,75,000 క్యూసెక్కుల వరద ముంచెత్తిన మునగని రాజధాని ప్రాంతం 2019 లో 8,00,000 క్యూసెక్కుల వరదకి ఎలా మునిగిపోతుందని  గట్టిగా ప్రశ్నించారు రైతులు. కరకట్ట దాటి చుక్క నీరు కూడా బయటి పొంగలేదు.  చంద్రబాబు అద్దె ఇంటిలో కూడా నీళ్లు ప్రవేశించలేదు. ఇలా వైసీపీ పెద్దల ప్లాన్ విఫలమవ్వడంతో.. ప్లాన్ బి ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. 

రాజధాని అమరావతిలో అవినీతి జరిగినట్టు అధికార పక్ష మంత్రులు గొడవ చేశారు. అమరావతి భూములు నిర్మాణాలకు పనికి రావని కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. అయితే రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాల్లో లక్షలాది మంది ప్రజలు బ్రహ్మాండమైన ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తున్నారు.కానీ ఇలా అమరావతిపై రభస సృష్టిస్తూనే ఉన్నారు. ఈ సమయంలోనే అసెంబ్లీ సమావేశాల్లో  తనంతట తానుగా అమరావతిపై స్వల్ప కాలిక చర్చను లేవదీసింది వైసీపీ. ఇన్ సైడర్ ట్రేడింగ్ పనులను మరోసారి పునరుద్ఘాటించారు వైసీపీ పార్టీ నేతలు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు కావాలని అంత బడ్జెట్ తమ వద్ద లేదని మరోరకంగా మొదలు పెట్టారు. దీంతో పాటు ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు అసెంబ్లీ సాక్షిగా ముఖ్య మంత్రి జగన్ రాజధానిని మూడు భాగాలు చేయవచ్చని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఆనాడు సిఎం జగన్ చేసిన ప్రకటన సంచలనం రేకెత్తించింది. ఆయన కోరుకున్న విధంగానే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. రాజధాని గ్రామంలో ఒక్క రోజు కూడా పర్యటించని జీఎన్ రావు కమిటీ అమరావతిని మార్చాలంటూ నివేదిక ఎలా ఇచ్చిందని రైతులు నిలదీసారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు రాజధాని సమగ్రాభివృద్ధి కోసం నివేదిక ఇవ్వాలని జిఎన్ రావ్ కమిటీ నియమిస్తూ ఇచ్చిన జీవోలు ప్రభుత్వం పేర్కొనగా ఆ కమిటీ అభివృద్ధి అవసరాన్ని మర్చిపోయి ఏకంగా రాజధానిని విడదీయాలని తేల్చేసింది. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా దాదాపు ఇదే తరహా నివేదికను ఇచ్చింది. రాష్ట్రంలో ఒక్క రోజు కూడా పర్యటించని బిసిజి కమిటీ కేవలం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తో పాటు అధికారులు ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఈ నివేదిక ఇచ్చిందని కొందరు చెబుతున్నారు. 

ఈ మొత్తం వ్యవహారాన్ని మొదటి నుండి నిశితంగా గమనిస్తూ వచ్చిన రైతులకి వైసీపీ పన్నుతున్న పన్నాగం అర్థమైపోయింది. దీనికి తుది ఘట్టంగా హైపవర్ కమిటీ నియమించడం సిఫార్సులను ఆమోదించటం.. క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం.. అదేరోజు ( జనవరి 18వ తేదీన ) అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద వ్యవహారాన్ని ఇటు ప్రతిపక్షాలకు గాని చివరకు వైసీపీలోని ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా అధికార పక్ష వ్యూహకర్తలు అమలు చేయడం విడ్డూరంగా మారింది. రాజధాని పరిధిలో ఉన్న గుంటూరు ,కృష్ణా జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు. రాజధాని మార్పు నిర్ణయం తరువాత ప్రజల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలను అధినేతకు చెప్పలేక తమను నిలదీస్తున్న ప్రజానీకానికి సరైన సమాధానం చెప్పలేక అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారు. దీంతో కొంత మంది ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయి సన్నిహిత అనుచరుల వద్ద తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం మూడు రాజధానులు ప్రకటన చేసిన తర్వాత తమను పిలిచి మాట్లాడడంలో లాభమేంటని గుర్రుగా ఉన్నారు. పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని వైసీపీ ప్రజాప్రతినిధులు నమ్ముతున్నారు. ఈ అంశాన్ని ప్రజలు మనసులో పెట్టుకుంటే మాత్రం తమకు భవిష్యత్తు ఉండదని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా మూడు రాజధానుల ఆటలో ప్రజలనే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా జగన్ పావులుగా మార్చడం విడ్డూరమనే చెప్పుకోవాలి.