చచ్చీ చెడీ గెలిచిన ఇండియా

 

వరల్డ్ కప్ క్రికెట్ 2015 లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా శుక్రవారం నాడు పెర్త్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా చచ్చీ చెడీ గెలిచింది. ఒక దశలో ఓడిపోతుందేమోనని అనిపించిన ఇండియా ఎట్టకేలకు గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 44.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు మొదటి నుంచీ మ్యాచ్ మీద పట్టు సాధించారు. అరివీర భయంకరుడని పేరొందిన బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ కూడా 21 పరుగులకు ఔటయ్యాడు. ఆ తర్వాత సునాయాస లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు వికెట్లు టపటపా రాలిపోయాయి. రోహిత్ శర్మ 7 పరుగులు, శిఖర్ ధావన్ 9, విరాట్ కోహ్లీ 33, రెహానే 14, సురేష్ రైనా 22, రవీంద్ర జడేజా 13 పరుగులు చేసి ఔటై ఇండియా గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా చేశారు. లక్ష్యం ఇంకా 50 పరుగుల దూరంలో వుండగానే 6 వికెట్లు కోల్పోయి ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఎట్టకేలకు 39.1 ఓవర్లకు 185 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ ధోనీ నిలకడగా ఆడి 45 పరుగులు చేసి జట్టు విజయానికి కారణమయ్యాడు.