ఎమ్మెల్యే బామ్మర్ది అక్రమ తవ్వకాలు.. జేబుల్లోకి కోట్లు, జరిమానా లక్షలు!!

'వడ్డించే వాడు మనవాడైతే.. ఏ బంతిలో కూర్చున్నా పరవాలేదు' అన్నట్టుగా 'అధికారంలో ఉన్నది మన పార్టీ అయితే.. ఎలాగైనా సొమ్ము చేసుకోవచ్చు' అని కొందరు ఏపీ అధికార పార్టీకి చెందిన నేతలు రుజువు చేస్తున్నారు.

 

మైలవరం నియోజకవర్గ పరిధిలో పేదల ఇళ్ల స్థలాల కోసం లోతట్టు భూములు కొన్నారు. అయితే, వాటిని మెరక చేయాలన్న సాకుతో ఎమ్మెల్యే బామ్మర్ది.. ఎలాంటి అనుమతులు లేకుండానే దేవదాయ భూములు, అటవీశాఖ పరిధిలోని కొండలను నెల రోజులుగా తవ్వేస్తున్నారట. విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి షాబాదలో ఇప్పటికే కోట్ల విలువచేసే అక్రమ తవ్వకాలు జరిగాయని సమాచారం. అలాగే, కొండపల్లి అటవీ భూముల్లో ఉన్న కొండల్ని తవ్వి గ్రావెల్‌ను తరలిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు, కొండపల్లి కపిలవాయి సత్రం దేవాలయ భూముల్లోనూ ఎటువంటి అనుమతులు లేకుండా 30 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారట. 

 

తవ్వకాలపై స్థానికులెవరైనా ప్రశ్నిస్తే.. మైలవరం నియోజకవర్గ పరిధిలో ఇళ్ల స్థలాల లే అవుట్లకు మట్టి అవసరమని, అందుకు మట్టిని తరలించాల్సి ఉందని ఎమ్మెల్యే బామ్మర్ది నమ్మబలుకుతున్నారట. గట్టిగా ఎవరైనా నిలదీస్తే బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని తెలుస్తోంది.

 

అటవీ భూముల్లో మట్టిని ఉచితంగా తరలించి ప్రభుత్వం నుంచి డబ్బును కాజేయడంతో పాటు తవ్విన గ్రావెల్‌ను బయట అమ్ముకుని కోట్ల రూపాయలు జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపినిస్తున్నాయి. అటవీ భూమిలోని మట్టిని తరలించడంపై ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదట. చివరికి ఎమ్మెల్యే బామ్మర్ది ఆగడాలపై సొంత పార్టీకి చెందిన స్థానిక నేతల నుంచే ఫిర్యాదులు వెళ్లడంతో అధికారులు జరిమానా విధించారని సమాచారం. 

 

కొండపల్లి అటవీ క్వారీలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై అటవీశాఖ, విజిలెన్స్‌ అధికారులు ఇటీవల దాడులు చేసి, అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.10 కోట్ల పైచిలుకు గ్రావెల్‌ ను తరలించారని అంచనా. కానీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు కేవలం రూ.10 లక్షల జరిమానాతో సరిపెట్టారు. అటవీశాఖ చట్టం ప్రకారం అక్రమంగా తవ్వేసిన గ్రావెల్‌ విలువకు ఐదురెట్ల వరకు జరిమానా విధించవచ్చు.. కానీ అధికారులు రూ.10 లక్షలతో సరిపెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.