హోమీ జె.బాబా ఇల్లు అమ్మేశారు!

 

 

 

భారత అణు రంగ పితామహుడైన హోమీ జె.బాబాకు చెందిన ముంబయిలోని మలబార్ హిల్స్ ప్రాంతంలో ఉన్న మూడంతస్థుల సువిశాలమైన బంగళా భారీ ధరకు అమ్ముడైంది. ఈ భవనానికి కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సిపిఏ)లో నిర్వహించిన వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి 372 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నాడు. దక్షిణ ముంబయిలోని సంపన్నుల నివాసప్రాంతమైన మలబార్ హిల్స్‌లో సముద్రానికి ఎదురుగా ‘మెహరాన్‌గిర్’గా పిలిచే ఈ బంగళా వుంది. జంషెడ్ బాబా వీలునామా ప్రకారం కస్టోడియన్ ఈ బంగళాను విక్రయించింది. అయితే బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్)కు చెందిన కొంతమంది ఉద్యోగులు ఈ వేలాన్ని వ్యతిరేకిస్తూ, ఈ బంగళాను అణు మ్యూజియంగా మార్చాలని కోరుతూ ఇటీవల ముంబయి హైకోర్టుకు వెళ్లడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు పంపించారు. అయితే హైకోర్టు సోమవారం నాడు ఈ వేలంపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ, అవసరమైతే వేలాన్ని రద్దు చేస్తామని పేర్కొంటూ కేసు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.