రంగు ప‌డింది.. జ‌గ‌న్ స‌ర్కారుపై హైకోర్టు సీరియస్..

ఒక్క‌సారి చెబితే విన‌రు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయ‌లు వేసినా ప‌ట్టించుకోరు. దులిపేసుకుంటారు. మ‌ళ్లీ చేసిన త‌ప్పే చేస్తుంటారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు పార్టీ రంగులు వేయొద్ద‌ని హైకోర్టు గ‌తంలోనే గ‌ట్టిగా హెచ్చ‌రించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ముందు వైసీపీ రంగుల‌న్నింటినీ తీసేయించింది. అయినా, స‌ర్కారు బుద్ధి మార‌లేదు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వైసీపీ రంగులు వేయ‌డం మాన‌లేదు. దీంతో, హైకోర్టు మ‌రోసారి ప్ర‌భుత్వంపై మండిప‌డింది. ఈసారి డెడ్‌లైన్ పెట్టి మ‌రీ.. రంగులు మార్చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. 

ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలు, ఆఖ‌రికి చెత్త నుంచి సంప‌ద త‌యారు చేసే కేంద్రాల‌కు సైతం వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 6వ తేదీ లోపు రంగులన్నింటినీ తొలగించాలని ఆదేశించింది. తొలగించిన అనంతరం కోర్టుకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తెలియజేసింది. రంగులు తొలగించారో లేదో, నివేదిక ఇవ్వాలని.. పిటిషనర్ తరపు న్యాయవాదిని కూడా ఆదేశించింది. 

ఏపీలో ప్రభుత్వ భ‌వ‌నాల‌కు వైసీపీ రంగులు వేయ‌డంపై జ‌రిగిన విచార‌ణ‌కు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీలు హైకోర్టు ధ‌ర్మాస‌నం ముందు హాజ‌రయ్యారు. కోర్టు ఆదేశాలు ఉన్నా.. చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు ఎలా వేస్తారని అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయొద్దని తక్షణమే  లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu