హైకోర్టు విభజనకు కేంద్రం సిద్దం: సదానంద గౌడ

 

రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి 9నెలలు పూర్తయినా ఇంతవరకు హైకోర్టు విభజన జరుగకపోవడంతో తెలంగాణా న్యాయవాదులు మళ్ళీ ఉద్యమబాట పట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణా ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగానే ఉంది. తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేస్తే 48 గంటలలోనే అందుకు అవసరమయిన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు చేస్తామని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నిర్మించబోయే హైకోర్టు భవనం సిద్ధమయ్యే వరకు రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్ లోనే కొనసాగవలసి ఉంటుంది కనుక ఒకవేళ తెలంగాణా హైకోర్టు విడిపోదలిస్తే అందుకు సమ్మత్తించడం తప్ప ఈ విషయంలో ప్రత్యేకంగా చేయవలసినది ఏమీ లేదు. కనుక ఇరు రాష్ట్రాలు హైకోర్టు విభజనకు సిద్దంగా ఉన్నట్లే భావించవలసి ఉంటుంది.

 

పార్లమెంట్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యం. వెంకయ్యనాయుడు చాంబర్ లో సమావేశమయిన కేంద్రమంత్రులు మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కేంద్ర న్యాయశాఖా మంత్రి సదానంద గౌడ ఒక ప్రశ్నకు బదులిస్తూ హైకోర్టు విభజనకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, ఇరు రాష్ట్రాలు చర్చించుకొని అంగీకారం తెలిపినట్లయితే కేంద్రప్రభుత్వం తదుపరి చర్యలు ప్రారంభించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలదే ఆలస్యమని ఆయన చెప్పకనే చెపుతున్నారు. కనుక ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు తక్షణమే స్పందించి అవసరమయిన చర్యలు చేపడితే సమస్య మరింత ముదరకుండా నివారించవచ్చును.