చెన్నైలో కుంభవృష్టి.. నీట మునిగిన నగరం.. స్తంభించిన జనజీవనం

 

చెన్నైలో అకాల వర్షాలు భయపెడుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు భారీ వర్షం కురిసింది. ఏకంగా 14  సెంటిమీటర్ల వర్షం కురవడంతో రోడ్లన్నీ జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. భారీ వర్షానికి జన జీవనం స్తంభించిపోయింది. కుండపోత వర్షాలకు కొన్ని చోట్ల ఇళ్లలోకి సైతం నీళ్లు చొరబడ్డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల తీరు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొత్త కాలువల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగి ఉండడంతో నీళ్లు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఆయా మార్గాల్లో ప్రయాణం గగనంగా మారింది.

ఇక వేలూరు జిల్లా పరిధిలో అనేక చోట్ల భారీ వర్షం దాటికి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కొన్ని కళాశాలల్లో జరగాల్సిన పరీక్షలను యాజమాన్యాలు వాయిదా వేశాయి. చెన్నై లోని ట్రిప్లికేన్, పురసైవాక్కం, విల్లివాక్కం,ఎగ్మోర్, ధీనగర్, వడపళని, అంబత్తూరు, ఆవడి ప్రాంతంల్లో భారీ వర్షం కురిసింది. ఈశాన్య రుతు పవనాలు మరింత బలపడే అవకాశాలతో మరో 3 రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీర ప్రాంత జిల్లాల్లో మోస్తరుగా వర్షం పడుతోందని ఉత్తర తమిళనాడులో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం సమాచారంతో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. 2015 లో ఇదే తరహాలో నవంబరు చివరిలో భారీ వర్షం పడటం, డిసెంబర్ 1,2 తేదీల్లో రాత్రికి రాత్రే కురిసిన వర్షాలతో చెన్నై నీట మునిగింది. ప్రస్తుతం అదే తరహా వర్షం పడే అవకాశాలు ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒంగోలు పట్టణం నీట మునిగింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న పరిణామాలతో అకాల వర్షాలు పడుతున్నాయి. ఇటీవల కర్ణాటకలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కర్ణాటకలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతవరణ శాఖ కేంద్రం. పలు రిజర్వాయర్లలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో అవి నిండుకుండలను తలపిస్తున్నాయి. ఏ క్షణమైనా రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటీవల వర్షాలకు జన జీవనం పూర్తిగా స్తంభించింది. వరద ప్రవాహంలో వాహనాలు కొట్టుకుపోయాయి. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని వందలాది గ్రామాలు నీట మునిగాయి. అపార పంట నష్టం జరిగింది. మొన్న కర్ణాటకలో నేడు చెన్నైలో ఏకధాటి వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.