తెలుగుదేశం కంచుకోటలకు బీటలు... అప్రమత్తం కాకపోతే కనుమరుగే..!

తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత విశాఖ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే పసుపు జెండాదే హవా కనిపిస్తుంది. వైజాగ్ రాజకీయాల్లో టీడీపీ ఛరిష్మా చారిత్రాత్మకం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. క్రమంగా వైసీపీ బలపడుతూ వచ్చింది. 2014లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన జగన్ పార్టీ... 2019కి వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకుని ఒక్క విశాఖ అర్బన్ మినహా జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. అయితే, జగన్ సునామీలో కూడా విశాఖ అర్బన్‌లో నాలుగు స్థానాలను కైవసం చేసుకుని తెలుగుదేశం సత్తా చాటింది. అంతేకాదు ఓడిపోయిన నియోజకవర్గాల్లోనూ గట్టిపోటీనిచ్చి స్వల్ప తేడాలతోనే సీట్లను కోల్పోయింది. సీట్లు రాకపోయినా, ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదని, విశాఖ జిల్లాలో తెలుగుదేశం పునాదులు స్ట్రాంగ్ గా ఉన్నాయని రుజువు చేసింది. కానీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం గోడలకు బీటలు వారుతున్నాయి. ముఖ్యనేతల మధ్య విభేదాలు, వివాదాలతో ఒక్కో నియోజకవర్గంలో పట్టు కోల్పోతోంది.

గంటాతో విభేదాలతో, ఎన్నికలకు ముందే అవంతి శ్రీనివాస్ వైసీపీ గూటికి చేరడంతో భీమిలిలో పట్టుకోల్పోయింది టీడీపీ. ఇక అవంతి బాటలోనే అయ్యన్నపాత్రుడు సొంత తమ్ముడు, తెలుగుదేశాన్ని వీడి... జగన్ గూటికి చేరనుండటంతో నర్సీపట్నం టీడీపీలో చీలికలు మొదలై పార్టీ బలహీనపడిందనే మాట వినిపిస్తోంది. అలాగే, విశాఖ డెయిరీ ఆడారి కుటుంబం వైసీపీలో చేరడంతో దాదాపు గ్రామీణ ప్రాంతంలో తెలుగుదేశం పట్టుకోల్పోందని అంటున్నారు. ఇక, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌, వైజాగ్ అర్బన్ అధ్యక్షుడు రెహ్మన్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరి, పార్టీ అధిష్టానం వరకు వెళ్లాయి. ఇలా, ప్రతి నియోజకవర్గంలో, ముఖ్యనేతల మధ్య విభేదాలు బయటపడుతుండటంతో, పార్టీ బలహీనపడుతుందనే మాట వినిపిస్తోంది. అయితే, త్వరలోనే జీవీఎంసీ ఎన్నికలు ఉన్నందున, అధిష్టానం అప్రమత్తమై... లీడర్లను సెట్ రైట్ చేయాలని, లేదంటే పార్టీకి నష్టం తప్పదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.  

మొత్తానికి ఒకపక్క విభేదాలు-వివాదాలు... మరోపక్క వలసలతో విశాఖ టీడీపీ కష్టాల్లో పడింది. అయితే, తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వైజాగ్ లో టీడీపీకి మంచి పట్టుండటం, సాగరతీర రాజకీయాలను పసుపు జెండా శాసించిన రికార్డు ఉండటంతో, మళ్లీ ఆ కీర్తికిరీటాన్ని నిలబెట్టుకునేందుకు టీడీపీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది.