ఈ 16 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి ఉంటే..?

 

ప్రధాని నరేంద్రమోడీ పనితీరుకు.. రాబోయే ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో.. అందరూ ఊహించిన ఫలితమే వచ్చింది. 1995 నుంచి ప్రతీ ఎన్నికల్లోనూ గెలుస్తూ వచ్చిన కమలనాథులే ఈ సారీ కూడా సౌరాష్ట్రలో జెండా ఎగరవేశారు. కానీ గెలుపొందిన ఆనందం ఏ కాషాయ పార్టీ కార్యకర్తలోనూ లేదు.. సాంకేతికంగా గెలిచాం తప్ప.. మానసికంగా గెలవలేదని వారు అంటున్నారు.. నిజం చెప్పాలంటే చివరిదాకా పోరాడి ఓడిన కాంగ్రెస్ పార్టీదే అసలు గెలుపని కొందరి భావన.

 

అసలు గుజరాత్‌లో బీజేపీ టార్గెట్ 150 సీట్లు.. ఆ టార్గెట్ను రీచ్ కావడం సంగతి పక్కనబెడితే.. కనీసం వంద సీట్ల మార్కును చేరడానికి భారతీయ జనతా పార్టీ అపసోపాలు పడింది. 99 స్థానాలతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా.. ఘనవిజయం కాకుండా సాధారణ గెలుపుతో సరిపెట్టుకుంది. 2002లో 127, 2007లో 117, 2012లో 116 సీట్లు కైవసం చేసుకుని తన జైత్రయాత్రను కొనసాగించిన కమలం.. నేడు అదే ప్రాంతంలో మూడంకెల సీట్లు గెలవడానికి ముక్కీ మూలిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రెండు దశాబ్ధాల కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పుంజుకుని 77 స్థానాలను గెలిచి మేజిక్ ఫిగర్‌కు దగ్గరగా వచ్చింది. ఊహించని ఈ ఫలితంతో గెలవకపోయినా.. గెలిచినంతగా సంబరాలు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.

 

రాహుల్ గాంధీ ప్రచారం, మూడు సామాజిక వర్గాల నుంచి ముగ్గురు నేతలు హస్తంతో జతకట్టడం వల్లే.. బీజేపీకి ఓట్ల శాతం తగ్గిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉండటం, జీఎస్‌టీ, పటేల్ రిజర్వేషన్లు సహా వివిధ అంశాలు అధికార పక్షాన్ని దెబ్బతీశాయి అంటున్నారు నిపుణులు. అయితే ఒక 16 స్థానాల్లో కాంగ్రెస్ చాలా తక్కువ మెజారిటీతో సీట్లను కోల్పోయింది. వాటిల్లో ఏ 10 స్థానాల్లో రిజల్ట్ కాస్త అటూ ఇటుగా అయినా... ఇప్పుడు వేరే విషయాలు చర్చించుకోవాల్సి వచ్చేదని.. ఏదో గుడ్డిలో మెల్లగా బీజేపీ గుజరాత్‌లో పరువు కాపాడుకుందని విశ్లేషకులు అంటున్నారు. అన్నట్లు ప్రధాని నరేంద్రమోడీ స్వస్థలమైన వాద్‌నగర్ ఉన్న "ఉంఝా" నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవడం చర్చనీయాంశమైంది.

 

ఇక్కడ బీజేపీ తరపున పోటీ చేసిన నారాయణ్ భాయ్ పటేల్ లల్లుదాస్, కాంగ్రెస్ అభ్యర్థి ఆశా పటేల్ చేతిలో 19,529 ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రాహుల్ .. తన నవసర్జన్ యాత్రలో భాగంగా ఉంఝాలో పర్యటించి.. వాద్‌నగర్ సమీపంలోని ఉమియా మాత ఆలయాన్ని సందర్శించారు. బొటాబొటి మెజారిటీ వచ్చిందని బాధపడుతున్న వేళ.. ప్రధాని సొంత ఊళ్లో పార్టీ ఓడిపోవడంతో బీజేపీ తలపట్టుకుంది. సో.. గుజరాత్ ఫలితాలు మోడీకి డెంజర్ బెల్స్ మోగించాయని చెప్పక తప్పదు.