బీజేపీ గెలిచింది.. కానీ...

 

గుజరాత్‌లో గతంలో సాధించిన స్థానాలకంటే పన్నెండు స్థానాలు తక్కువ పొందింది. గతంలో 60 సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 70 సీట్లను దాటింది. గుజరాత్ నుంచి వచ్చి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశ ప్రధాని స్థాయిలో కాకుండా గుజరాత్ ముఖ్యమంత్రి తానే అన్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేశారు. మోదీ పనితీరుకు, ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలకు ఈ ఎన్నికలు రెఫరెండంగా అందరూ భావించారు. ఈ ఎన్నికలలో అటూ ఇటూ అయితే కేంద్రంలో బీజేపీ భవిష్యత్తు మీద ప్రభావం చూపించే అవకాశం వుంది కాబట్టి గుజరాత్ ఎన్నికల మీదే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. మరోపక్క హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరిగినప్పటికీ  అందరికీ ఎక్కువ ఆసక్తి గుజరాత్ మీదే నిలిచింది. ఎట్టకేలకు గుజరాత్ ఫలితం బీజేపీకి అనుకూలంగానే వచ్చింది. ఫలితం అయితే అనుకూలంగా వచ్చిందిగానీ, ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి, మోదీకి ఒక హెచ్చరికగానే భావించాల్సి వుంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీ అనుకూల పవనాలు వున్నాయి. నోట్ల రద్దు తర్వాత ఆయన మీద చాలామందిలో వ్యతిరేకత వున్నప్పటికీ ఎన్నికల విషయానికి వస్తే బీజేపీకి అనుకూల ఫలితాలే ఇప్పటి వరకూ వచ్చాయి. గతంలో జరిగిన పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో నోట్ల రద్దు ప్రభావం కనిపించలేదు. జనం బీజేపీకే పట్టం కట్టారు. అయితే గుజరాత్ పరిస్థితి మాత్రం వేరు. తమ రాష్ట్రం నుంచి వెళ్ళి ప్రధాని అయిన మోదీ అంటే ఆ రాష్ట్రంలో అభిమానం ఎక్కువగానే వుంటుంది. బీజేపీ, రాజకీయ వర్గాల అంచనాల ప్రకారం బీజేపీకి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రావాల్సి వుంది. అయితే అందుకు భిన్నంగా గతంలో కంటే సీట్లు బాగా తగ్గిపోయాయి. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ అయిన 92 స్థానాలను దాటింది. కౌంటింగ్ ప్రారంభమైన మొదట్లో అయితే బీజేపీ కంటే కాంగ్రెస్ ఆధిక్యంలో వుండటం బీజేపీ వర్గాలను షాక్‌కి గురి చేసింది. ఎన్నికలు ముగిసిన తర్వాత వెలువడిన సర్వే ఫలితాలు భారతీయ జనతాపార్టీని ఆకాశంలో నిలబెట్టాయి. ప్రతి సర్వే బీజేపీకి మెజారిటీ భారీగా పెరిగిపోతుందని, కాంగ్రెస్ పార్టీకి గతంలో వున్న సీట్లు కూడా రావని జోస్యం చెప్పింది. అయితే ఫలితాలు మాత్రం సర్వేలతో సరిపోలని విధంగా వచ్చాయి.

 

రెండు రాష్ట్రాల్లో విజయం సాధించడం పట్ల బీజేపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే వారి మనసుల్లో మాత్రం ప్రజల నుంచి పరోక్షంగా అందిన హెచ్చరిక మెదులుతూనే వుంటుంది. విజయం సాధించినప్పటికీ గుజరాత్ ఎన్నికలు బీజేపీకి ఒక గుణపాఠంగానే భావించాల్సి వుంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏడాదిన్నరలో రాబోతున్న జనరల్ ఎలక్షన్లలో బీజేపీ విజయం నల్లేరు మీద నడక కాబోదనే విషయాన్ని గుజరాత్ ఫలితాలు స్పష్టంగా చెప్పాయని చెబుతున్నారు.