సచివాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న రాయలసీమ న్యాయవాదులు...

 

సీమ సెగ అమరావతికి తాకింది, హైకోర్టును తమ ప్రాంతంలో పెట్టాలనీ వెలగపూడి సచివాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు లాయర్లు. ఒక వైపు సచివాలయంలో కేబినెట్ జరుగుతుంటే, మరో వైపు ఈ ఆందోళన జరగడం చర్చనీయాంశమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని రాజధానిని ఇక్కడ పెట్టారు కాబట్టి హై కోర్టు తమ ప్రాంతంలో పెట్టాలని డిమాండ్ చేశారు న్యాయవాదులు. రాయలసీమలో హై కోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమకు చెందినటువంటి న్యాయవాదులు విధులు బహిష్కరించి వారు ఆందోళన చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో రాయలసీమ న్యాయవాదులు మాట్లాడుతూ, అధికార వికేంద్రీకరణ ప్రకారం రాజధాని అమరావతిలో ఉంది కాబట్టి రాయలసీమకు హైకోర్టునైనా అక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో ఏవిధంగా ఒకేచోట హైదరాబాద్ అభివృద్ది చెందిందో అక్కడ నుంచి ఒక్కసారిగా మనమంతా బయటకు రావటం జరిగిందని రాజధాని లేకుండా , హైకోర్ట్ లేకుండా ఇన్ని రోజులు బయట ఉన్నామని, ఆ పరిస్థితి మరల ఇప్పుడు రాకుండా ఉండాలంటే అన్ని చోట్ల అభివృధ్ధి చేయాలని, దానికోసం రాయలసీమకు హైకోర్ట్ ఇచ్చి అన్ని ప్రాంతాలను అభివృధ్ధి చేయాలని కోరారు.


కోర్ట్ రాజధాని మధ్యలో ఉండాలనేది సర్కారు వారి దురాలోచన అని, రాజధానికి మధ్యలో హైకోర్ట్ లేకుండా దేశంలో పదకొండు రాష్ట్రాల్లో ఉన్నాయని అన్నారు. పెద్ద పెద్ద రాష్ట్రాల్లోనే రాజధాని ఒకచోట ఉంటే హైకోర్ట్ ఒకచోట ఉందని అటువంటిది అమరావతిలో రాజధాని ఉన్నప్పుడు రాయలసీమలో హైకోర్ట్ ఇవ్వటానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా హైకోర్టును గాని రాజధానిని గాని ఏదో ఒకటి మాత్రం ఏర్పాటు చేయాలి అని వెంటనే దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లేక పోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు.