చాలా సైలెంట్ గా బీజేపీకి షాకిచ్చారుగా..

 

గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విషయంలో పెద్ద దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో బీజేపీ చేస్తున్న హంగామాకి చంద్రబాబు చెక్ పెట్టినట్టు తెలుస్తోంది. అది కూడా చాలా సైలెంట్ గా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు తెలుస్తోంది. న‌ర‌సింహ‌న్ తీరు స‌రిగా లేద‌నీ, తెలంగాణ ప‌క్ష‌పాతిగా వ్య‌వ‌హ‌రిస్తూ.. తెలంగాణ రాష్ట్రానికి వత్తాసు పలుకుతూ.. ఏపీ పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్నారంటూ నరసింహన్ మీద బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ మండిపడ్డారు. ఇక ఎంపీ హరిబాబు ఒక అడుగు ముందుకేసి ఏకంగా కేంద్రానికే లేఖ రాశారు. దీంతో ఈ లేఖను కేంద్రం సీరియస్ గా తీసుకుందని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని... నరసింహన్ కి బరువు తగ్గించే యోచనలో వున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని.. ఆంధ్రప్రదేశ్ కి కొత్త గవర్నర్ ఎంపిక దాదాపు పూర్తయినట్లేనని, వారంపది రోజుల్లో ప్రకటన వెలువడవచ్చని వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే కదా.

 

దీంతో బీజేపీ చేసిన హంగామాకు.. వచ్చిన వార్తలను బట్టి నిజంగానే ఏపీకి ప్రత్యేకంగా కొత్త గవర్నర్ వస్తాడేమో అని భావించారు. బడ్జెట్ సమావేశాల లోపు ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇక్కడి వరకూ ఒకటైతే... అసలు ఈ గవర్నర్ వివాదంలో ఇప్పటివరకూ చంద్రబాబు స్పందించలేదు. అసలు మొదటి నుంచి ఈ వ్యవహారాన్ని అంతగా పట్టించుకోలేదు చంద్రబాబు. కొందరు నాయకులు ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన దీనిపై పెద్దగా స్పందించలేదు. ఇది అనవసరమైన విషయం అంటూ పక్కనపెట్టారు. దీంతో తమ అధినేతే  ఈ విషయం గురించి మాట్లాడనప్పుడు.. మాకెందుకని లైట్ తీసుకున్నారు. అయితే ఎలాగూ మిత్రపక్షం కాబట్టి కేంద్రం చెప్పినట్టు చంద్రబాబు వింటారని భావించిన బీజేపీ... ఈవిషయంలో కూడా చంద్రబాబు ప్రత్యేక గవర్నర్ కు అనుకూలమే అని అనుకున్నారు.

 

కానీ అయితే ఈ విషయంలో చంద్రబాబు భిన్నంగా స్పందించడంతో బీజేపీ నేతలు ఖంగుతిన్నారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును ఈ విషయంపై అడగగా.. ఇది బీజేపీ పార్టీ వ్యవహారంగా ఆయన మాట్లాడటంతో బీజేపీ నేతల ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయాయట. చంద్రబాబు కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తారని భావించామని... కానీ చంద్రబాబు ఇలా అంటారని ఊహించలేదని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారట. అంతేకాదు.. ఈ విషయంలో చంద్రబాబు సానుకూలంగా లేకపోతే… కేంద్రం కూడా దీనిపై ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం లేదని పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఎలాంటి హంగామా లేకుండా... చాలా సైలెంట్ గా చంద్రబాబు.. బీజేపీకి సమాధానం చెప్పారు. చంద్రబాబు సానుకూలంగా లేకపోతే… కేంద్రం కూడా నిర్ణయం తీసుకోలేదు అని బీజేపీ నేతలకు అర్ధమైందంటే... చంద్రబాబు స్టామినా ఏంటో అర్ధమైనట్టే....