తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు నరసింహన్‌ అభినందనలు తెలిపారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ..వృద్ధిరేటులో తెలంగాణ ముందంజలో ఉందని అన్నారు. గత నాలుగున్నరేళ్లలో నీటిపారుదల రంగానికి రూ.77,777 కోట్లు ఖర్చు చేశామని.. రాబోయే కాలంలో రూ.లక్షా 17 వేల కోట్ల విలువైన పనులు చేస్తామని చెప్పారు. పారిశ్రామిక, ఐటీ రంగంలో పారదర్శక విధానాలు అమలవుతున్నాయని అన్నారు. ఐటీ రంగం అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వివరించారు.

గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • విద్యుత్‌ కోతలను అధిగమించి ప్రభుత్వం తొలి విజయం సాధించాం.
  • విద్యుత్ సంక్షోభాన్ని తొమ్మిది నెలల్లోనే అధిగమించాం.
  • దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
  • కళ్యాణలక్ష్మి పథకం దేశానికి ఆదర్శం
  • సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించడం సంతోషదాయకం.
  • రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం.
  • రైతులకు గిట్టుబాటు ధర కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. 
  • భూముల రిజిస్ట్రేషన్‌లో పారదర్శకత పాటిస్తున్నాం.
  • వచ్చే విద్యాసంవత్సరం మరో 119 గురుకులాలు ఏర్పాటు.
  • ప్రసూతి, శిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు.
  • కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా పురోగమిస్తోంది
  • ప్రస్తుత పద్ధతిలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ కొనసాగిస్తూ సొంత ఇంటి స్థలం ఉన్న పేదలకు గృహ నిర్మాణం కోసం ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది
  • ఎస్సీ వర్గీకరణ కోసం కూడా ప్రభుత్వం కేంద్రం పై పోరాటం చేస్తుంది.
  • సందర్భోచితంగా ఐకేపీ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలన్నది ప్రభుత్వ యోచన. 
  • రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన లక్ష్యాలను ప్రణాళికలను పథకాలను నిర్దేశించుకుంటూ ప్రభుత్వం పురోగమిస్తోంది.

ప్రజల బతుకుల్లో సుఖశాంతులు వెల్లివిరిసే బంగారు తెలంగాణ నిర్మాణం ప్రజలు అందించిన అపూర్వ విజయం పునాదిగా నా ప్రభుత్వం మరోసారి పునరంకితం అవుతుందని ఈ ఉభయ సభల సాక్షిగా నిండు విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. జైహింద్‌ అంటూ ప్రసంగం ముగించారు.